ఓరుగల్లు కోటలో
పోరు దృశ్యాల కళ
చెమర్చిన
శిల్పం సాక్షిగా… అంటూ శిల్పి గా మారి తన కలాన్ని ఉలిగా మలిచి జీవకళకు ప్రాణం ఊది, సాహితీ క్షేత్రంలో చైతన్య తరంగమై
ఉవ్వెత్తున ఎగిసి ఎత్తు పల్లాలను సైతం అధిగమించి ఒక్కడై నిలిచి
తన కవితాసోయగానికి తానే శాశ్వతమైన కీర్తిని పులిమిన
కవి మిత్రుడు, సోదర సమానుడు డా. మడత భాస్కర్ గారు.
సాహితీ క్షేత్రంలో మడత భాస్కర్ పేరు వినని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదు అక్షర సత్యం. తన జీవితమే ఓ మధుర కవితా పుస్తకం తన కలం ఒలికించిన కవిత్వసుధలు కలకాలం నిలిచే శిల్ప సౌందర్య గుర్తులు.
వచన సాహిత్యం,సంపాదకత్వం, లేఖాసాహిత్యం, వ్యాస సంకలనం, దీర్ఘ కవిత వంటి అద్భుత ప్రక్రియలలో తనకలాన్ని వారధిగా చేసి అద్భుత రచనలు అందించారు భాస్కర్ గారు. తరువాతి కాలంలోతన దృష్టి అల్పాక్షరాలతో అణల్పార్ధ రచనకు శ్రీకారం చుట్టి నానీల ప్రక్రియలో రంగ ప్రవేశం చేసి నానీల కమ్మలు అనే చక్కని పుస్తకాన్ని వెలువరించినారు. ఈ కవికి నానీలకుతి తీరలేదంటూ నానీల తండ్రి ఆచార్య ఎన్ గోపి గారిచేత ప్రశంసలు అందుకున్న మేటితరం కవి పుంగవుడు ఆయన.
ఇక తన నానీ ప్రస్తానంలో రెండవ పుస్తకమే ఈ నానీశిల్పాలు. దీనికి ఆచార్య గోపి గారు శిల్పమనర్ఘం పేరున ముందుమాట రాసి భాస్కర కవి లోని పదునైన కవిత్వ కోణాన్ని పాఠక హృదయానికి చేరవేశారు. ఈ పుస్తకాన్ని తనకెంతో ఆప్తుడైన తను పెద్దన్న గా చెప్పుకునే ఓరుగల్లు సాహితీ జగతిలో తన తండ్రి గారి పేరున శ్రీ చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదికను స్థాపించి ఆ సాహితీ సుక్షేత్ర తరువు నీడ లో ఎందరో సాహితీమూర్తులకు అండగా నిలుస్తున్న శ్రీ చక్రవర్తుల శ్రీనివాస్ గారికి అంకితం ఇవ్వడం జరిగింది గొప్ప వేదిక మీద అట్టహాసంగా!
ఇక ఈ పుస్తక లోతుల్లోకి అడుగేస్తే చేయి పట్టి తడుమకుండానే ప్రతి అక్షర శిల్పం ఆద్యంతం మన మనసును ఓ సుందర దృశ్య కళా కౌముదిలో విహరించినట్లుగా తోస్తుంది. ఆనందం ఎక్కడో లేదు భాస్కర కవి అన్నట్లు…
ఈ శిల్పాలకెందుకో
వృద్ధాప్యం రాదు
శిల్పి
అమృతం తాగించాడేమో
అంటూ మనసే ఒక శిల్ప సమూహం చేసి వాటి మధ్యనే తను జీవిస్తున్నట్లు తాదాత్మ్యం చెందుతూ పులకరించిపోతున్నడు.
ఈ కవి హృదయం నాకు సుమారు 13సంవత్సరాల పరిచయం ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లలో నేను ఒకన్ని అందుకే నేనంటాను…
” ఈ కవి! తన కలానికి ఉన్న ఆర్థి ఆవేశంవల్లనే కవన సేద్యంలో
తన ప్రతి పదం ఓ కవితాదర్శ సూక్తి. కాలం కొన్ని విషయాల్లో తనకు అన్యాయం చేసినా… ఎత్తిన కలం దించక బరువు ఎంతైనా బాధ్యతతో అక్షర గొడుగును మోస్తూనే ఉన్నడు ”
కవిత్వం కవి హృదయపొరల్లో రగలాలి ఎప్పుడూ అలా అయితేనే అది రసవత్తమవుతుంది.
జీవిత పార్శ్వాలు ఎన్నో లెక్కపెట్టగలిగిన ఈయన నానీ శిల్పాలు ఓ అద్భుత రచన.
ఈ పుస్తకంలో తను తాకని శిల్పం లేదు.
గడియారానికీ
నాకూ పోటీ
ఇద్దరమూ
శ్రమజీవులమే.. అద్భుతమైన బావుకతతో తొలి పేజీలోనే తన ఆత్మ సంఘర్షణను ఈ కవితా ఖండికలోచొప్పించి ఆలోచింపజేశాడు.
శిఖరాన్ని చేరాను నిజమే కానీ తొలిమెట్టును మరిచిపోలేదు అని తన వినయాన్ని ఈ పుస్తకంలో తనే ఓ శిల్పంగా మారి ప్రతి పేజీలో తన హృదయ ఆర్ధతను ఉప్పొంగించాడు.
అర్ధరాత్రి అలసి పడుకుంది నగరం
కలలు మాత్రం మేల్కొంటున్నాయి అని సమాజంలో పేదింటి గుమ్మం పడే నిద్రలేని రాత్రుల చీకటి కోణాన్ని తన కవితా ధారల్లో స్పృశించి సమాజానికి సందేశ వారధిగా నిలిచాడు.
ఉచితాలకు అలవాటు పడ్డారు ప్రజాస్వామ్యం ఒక డొల్ల అని ప్రభుత్వాలు చేసే ఉచిత పథకాలు
మనిషిని సోమరులను చేస్తాయి అంటూ తన సున్నిత కలంతో హెచ్చరిస్తున్నారు.
తన కవిత్వం అంటే అమ్మ నాన్న
జన్మ ప్రధాతలైన వారు నిజంగా అదృష్టవంతులని నేనంటాను.
దురదృష్టంవలన వారి నాన్నగారి మరణం కవి మిత్రునికి తీరనిలోటు అయినా ఆరని తన ఆవేదనను నాన్నగారి మీదున్న ప్రేమను ఆపుకోలేక ఇలా అంటాడు
చెరువుగట్టు పై నుండి
చూశా
నాన్న చెరువు
మాట్లాడుకుంటున్నారు
ఆ కాకి
నన్నే తదేకంగా చూస్తుంది
నాన్న
ఆ వేషంలో వచ్చాడా
ఈ పదకోమలంలో తను విదిల్చిన కన్నీళ్ళ కవితాక్షరాలు ప్రతి హృదయాన్ని ద్రవింప చేస్తుంది.
ఈ పుస్తకంలో తను ఉపాధ్యాయుడు కనక బడిమెట్లనూ..చెట్లను తడిమాడు తన కవితల్లో అవికూడా ఓ చైతన్య శిల్పాలే. ఈ కవికి ఆశ ఆవేశమూ ఎక్కువే! కవితాదొంతరులు దాటాలని తొందర ఎక్కువ కూడా!
నా జేబులోని పెన్ను
గుండెకు దగ్గర
అందుకే
ఇన్ని స్పందనలు రాల్తాయి
అని ఆపక రచనల పొంగులో ఉత్తుంగ తరంగమై ఉరకలేస్తున్నడు.
సామాజిక జీవనాన్ని వంట పట్టించుకున్న భాస్కర్ గారు తాను పుట్టి పెరిగిన పల్లెటూరు సోయగాలను స్నేహ పరిమళాలను, తమ ఇంటి వృత్తి ధర్మాన్ని మరువక మనసు మర్చిపోలేనన్ని నానీల శిల్పాలు అత్యంత రమణీయంగా చెక్కాడు.
తన అర్ధాంగి సంధ్య గారిపై మచ్చుకు మమకారపు నానీని ఇలా..
ఎప్పుడూ కవిత్వమేనా
అన్నదామె
నువ్వే నాకు ప్రేరణ
అన్నాడతడు ఎంత గొప్పగా ఆత్మ నివేదనను ఈ ఖండికలో పొందించాడు.
పురిటి నొప్పులు
కాదు కవిత్వం
లోపల వెలిగే
చండ్ర నిప్పులు
అనీ కవిత్వంపై కన్నులు
మూయనివ్వని మాధుర్య ప్రీతిని ఇలా ఇష్టంగా మలుచుకున్నన్నడు.
ఊహకందని భావన, ఉత్తమస్ఫురణ, ఉత్తేజశక్తి అమోఘ ప్రతిభ, ఆలోచింపచేసే సరళిలో సాగిన ఈ నానీ శిల్పాలు గొప్ప రచనగా సాగిందనడంలో సందేహం లేదు. పాఠకప్రియలు తప్పకుండా చదవదగినటువంటి పుస్తకం. మడత భాస్కర్ గారి సాహితీ పరిమళం మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ…
- గన్నోజు ప్రసాద్
9491617161
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
