హైదరాబాద్: డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు 600 మంది వైద్యులు, వైద్యవిద్యార్థులు, అధికారులు, పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పరుగు ప్రారంభించారు. అనంతరం డాక్ట్రెస్ సంస్థ ప్రారంభించనున్న గ్లిడా (గ్లోబల్ ఇండియన్ డాక్టర్స్ అలయన్స్) యాప్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ,
“డ్రగ్స్ వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉక్కుపాదం మోపి అణిచివేస్తున్నారు. యువత భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమని అందరూ గుర్తించాలి. డాక్ట్రెస్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం ఎంతో అభినందనీయమైనది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలి. ప్రజలందరూ దేవుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకొని సమాజ హితానికి కృషి చేయాలి. నేను కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకరిస్తాను” అన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శ్రీకీర్తి శశి, ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ, “డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే కాకుండా, డాక్టర్లు ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఆపాలని సమాజంలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ పరుగు నిర్వహించాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, నార్కోటిక్స్ బ్యూరో వడ్డే నవీన్, సాండిల్య ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ కొలను జగ్జీవన్ రెడ్డి, అనేక ఆసుపత్రుల వైద్యులు అతిథులుగా పాల్గొన్నారు.
“డ్రగ్స్ వద్దు – నవసమాజమే ముద్దు” నినాదంతో యువత ముందుకు రావాలని, యువత సైనికుల్లా మారి మాదక ద్రవ్యాల వినియోగంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు యల్. శ్రీనివాస్.
పరుగు ముగిసిన అనంతరం పాల్గొన్న వారికి డాక్ట్రెస్ సంస్థ తరఫున మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.