అమరావతి: తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్”ను మార్చి 16న ఆవిష్కరించనున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు.

తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాల కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో, ఆ త్యాగానికి గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన వెల్లడించారు.

అమరావతి సమీపంలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వనం అభివృద్ధి చేయబడినట్లు నిర్వాహకులు తెలిపారు. శంకుస్థాపన జరిగిన 6 నెలల్లోనే ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తెలుగు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని డూండి రాకేశ్ కోరారు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయేలా అమరావతిలో ప్రతిష్ఠిస్తున్న “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని ఆయన తెలిపారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *