”నన్నే డబ్బులు అడుగుతారా?” అంటూ బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించమంటూ వచ్చిన అధికారులపై విరుచుకుపడుతాడు ఓ బడా బాబు. ఈ సీన్ ఇటీవల వచ్చిన సర్కార్ వారి పాట సినిమాలోనిది. అచ్చం అలాంటి సీన్ రియల్ లైఫ్‌లోనూ చూపిస్తున్నాడు బెజవాడ ఎంపీ కేశినేని నాని. ఈ పెద్దమనిషి తెర వెనుక నడిపించిన వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బ్యాంక్‌లకు ఎగనామం పెట్టే క్రమంలో ఉచ్చులో చిక్కుకుంటున్నట్టే కనిపిస్తోంది. కేశినేని అప్పుల భాగోతం బట్టబయలైయ్యింది. కోట్లాది రూపాయల అప్పులు బ్యాంక్ నుంచి తీసుకుని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసు దాక తెచ్చుకోవడం వెనుక కేశినేని వ్యవహార శైలియే కారణమే చర్చ వినిపిస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేశినేని కార్గో అండ్ క్యారియర్ ప్రైవెట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద గతంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకునేటప్పుడు అధికారం, పదవి అడ్డుపెట్టి బ్యాంక్ అధికారుల ముక్కుపిండి మరీ లోన్ తీసుకున్నారు ఈ ఎంపీ గారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తిరిగి అప్పు చెల్లించండి అంటూ ఇటీవల బ్యాంక్ అధికారులు అడుగుతుంటే.. మొండితనం చూపించడమే కాదు తననే అడుగుతారా అంటూ వారిపై ఫైర్ అయ్యారట. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించే ప్రయత్నం చేశారట. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా రిసీవ్ చేసుకోలేదంట ఈ ఎంపీగారు. దీంతో యూనియన్ బ్యాంక్ అధికారులు.. ఎంపీగారి దగ్గర చేసేదేంలేక అప్పు వసూలు చేసేందుకు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు వేశారట. కేశినేని అప్పుల పై స్పందించిన ట్రిబ్యునల్ కేశినేని కార్గో అండ్ క్యారియర్, కేశినేని శ్రీనివాసరరావు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. జూలై 11వ తేదిన ఉదయం 10.30నిమిషాలకు డెబిట్ రికవరీ ట్రిబ్యూనల్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐదేళ్ల క్రితం వెనక్కి వెళితే 2017లో తన ట్రావెల్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించి ఎంపీ కేశినేని పెద్ద చర్చకు తావిచ్చారు. బస్సులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి వందల కోట్లు తెచ్చుకున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి కేశినేని మరో విజయ్ మాల్యా లాగా తయారయ్యాడని అప్పట్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. బ్యాంక్ నుంచి తెచ్చుకున్న డబ్బులను రాజకీయావసరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల ట్రావెల్స్ నిర్వహణ భారం పెరిగి మూసివేశారనే టాక్ వినిపించింది. ట్రావెల్స్ సంస్థను మూసివేసిన కేశినేని ఆ తర్వాత కార్గో బిజినెస్ మొదలుపెట్టారు. దానికి కూడా బ్యాంక్ అప్పులు తీసుకోవడంతో తలకు మించి భారం అవ్వడంతో ఆర్థికంగా దివాల తీసినట్టు బెజవాడలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కేశినేని ట్రావెల్స్ నష్టాల ఊబిలో చిక్కుకపోగా.. ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరిపోయిందట. దానికి తోడు గతంలో బ్యాంక్ ల నుంచి చేసిన అప్పులు కాస్తా మెడకు చుట్టుకుంటున్నాయి. మేకపోతు గాంభీర్యం.. ఛాలెంజ్‌లు విసరడం.. తన అంత గొప్ప లీడరే లేరు అన్నట్టుగా మీడియా ముందు డైలాగ్‌లు కొట్టే కేశినేని నాని తీరు బ్యాంక్ అధికారుల నోటీసుతో అసలు రంగు బయటపడింది. టాటా-బిర్లాలు తనకు దగ్గర.. అని బడాయిలు చెప్పే ఈ పెద్దమనిషి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని బెజవాడలోని కేశినేని ఆంతరంగికులే చర్చించుకుంటున్నారు. ఇటువంటి కేసులు మాఫీ చేయించుకోవడానికి ఎంపీ పదవిని వాడుకుంటున్నారని కూడా బెజవాడ కోడైకూస్తోంది.