#GameChanzer

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 14 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికల్లో 7 నుండి 14 అసెంబ్లీ సీట్లలో పోటీచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే పోటీ చేయబోయే సీట్ల సంఖ్యపై నేతలు కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు. అయితే పవన్ తాజాగా ప్రకటించిన సీట్ల సంఖ్య గతంలో ప్రకటించిన సీట్లలో సగం కూడా లేవు.

గతంలో ఒకసారి మీడియా సమావేశంలో మాట్లాడినపుడు ఒంటరిగా పోటీ చేసినా 30 నియోజకవర్గాల్లో గెలిచేంత సత్తా జనసేనకు ఉందని పవన్ చెప్పారు. పవన్ మాటలు విన్నవాళ్ళు నిజమేనేమో అని అనుకున్నారు. తీరాచూస్తే ఇపుడు ఆ సంఖ్యను 14సీట్లకు పవనే తగ్గించేశారు. మరి మిగిలిన 16 సీట్లు ఏమైనట్లు ? ఇక్కడే పవన్ లెక్కలమీద జనాల్లో నమ్మకం పోతోంది. రెండు రోజుల క్రితం చెప్పిన మాటలు కూడా పవన్ కు గుర్తుండదు.

అందుకనే ప్రతి మీటింగులోను పవన్ నోటికొచ్చిందేదో చెప్పేస్తుంటారని అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. అసలు తెలంగాణాలో జనసేనకు ఏమాత్రం బలముందో ఎవరికీ తెలీదు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు ఉపఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాలను పవన్ జారవిడుచుకుంటున్నారు. ఇపుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీచేయాలని జనసేన నేతలు ఎంత చెప్పినా పవన్ అంగీకరించలేదు. మునుగోడులో జనసేన పోటీ చేసుంటే తన పరిస్ధితి ఏమిటో తెలిసేది.

పవన్ వైఖరి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తారని ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే రోజుకోమాట చెప్పే పవన్ యూటర్న్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటారు. క్షేత్రస్థాయిలో పార్టీకి అసలు బలమే లేనపుడు ఏకంగా అధికారంలోకి ఎలా వచ్చేస్తామని అనుకుంటున్నారో పవన్ కే తెలియాలి. ఏపీ పరిస్ధితే ఇలాగుంటే ఇక తెలంగాణా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *