-
కేంద్రం అదిరిపోయే స్కీం
-
మీరు కోటి రూపాయలు గెలుచుకునే లక్కి చాన్స్ ఇది.
సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది కేంద్రం. జీఎస్టీ బిల్లును మొబైల్ యాప్ లో ఆప్లోడ్ చేస్తే రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు రివార్డుగా ఇవ్వనుంది. అతి త్వరలో ఈ యాప్ ను లాంఛ్ చేయనుంది. ఈ యాప్ పేరు ‘ మేరా బిల్ మేరా అధికార్ ‘.
ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకం కింద ఈ యాప్లో రిటైలర్ లేదా వ్యాపారుల నుంచి స్వీకరించిన బిల్లును అప్లోడ్ చేసిన వ్యక్తులకు నెలవారీగా లేదా త్రైమాసికంగా రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ఇద్దరు అధికారులు పేర్కొన్నారు. మేరా బిల్ మేరా అధికార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లభించనున్నట్లు తెలిపారు. అయితే వినియోగదారులు అప్లోడ్ చేసే ఇన్ వాయిస్ లో జీఎస్ టీ ఐఎన్ నంబర్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.
వినియోగదారులు ఈ యాప్ లో నెలకు 25 బిల్లుల వరకు అప్లోడ్ చేయవచ్చు. అయితే కనీసం రూ. 200 బిల్లు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత 500 లక్కీ డ్రాలను తీసి వినియోగదారులకు క్యాష్ ప్రైజ్ బహుమానంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి నెల లేదా మూడు నెలల్లో రెండు సార్లు ఈ లక్కీ డ్రాను తీయనున్నట్లు పేర్కొన్నారు. నగదు బహుమానం రూ. కోటి వరకు ఉంటుందన్నారు. కాగా ఈ యాప్ ను అతి త్వరలో లాంఛ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల చివరి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉందన్నారు.
జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు కేంద్రం కఠిన నింబధనలు అమలు చేస్తున్న విషయం తెలిసింది. వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లు దాటే వ్యాపారాలకు ఎలక్ట్రానిక్ ఇన్ వాయిస్ తప్పని సరి చేసింది. ఆగస్టు 1 నుంచే ఈ రూల్ అమలు చేస్తోంది. ఏ వ్యాపారి కూడా జీఎస్టీ ఎగ్గొట్టకుండా చేసేందుకు ఇప్పుడు సామాన్యులను కూడా ఇందులో భాగం చేస్తోంది. రివార్డు ప్రైజ్ కోసం కస్టమర్లు కచ్చితంగా వ్యాపారుల నుంచి ఇన్ వాయిస్ తీసుకుంటారు. బిల్లు ఇవ్వకపోతే అడుగుతారు. దీంతో జీఎస్టీ ఎగవేతకు అవకాశం ఉండదు.
జీఎస్టీ బిల్లును అప్లోడ్ చేసేందుకు రూపొందించే యాప్ ను జీఎస్టీ నెట్ వర్కే అభివృద్ధి చేస్తోంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే దేశంలోని పౌరులందరూ సులభంగా తాము చెల్లించే బిల్లును అప్లోడ్ చేయవచ్చు. ఫలితంగా భారీ రివార్డును పొందే అవకాశం పొందవచ్చు.