మామూలుగా వచ్చే జ్వరం.. మందులు వేసుకున్నా, లేకున్నా 3, 4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ జ్వరం మాత్రం వారం, పది రోజులైనా వదలడం లేదు. పైగా కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు రెండు వారాలు ఉంటున్నాయి. దీంతో ఇదేం మాయదారి జ్వరమో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అది ఏ రకమైన జ్వరమో తేల్చలేక.. రోగులను డయాగ్నస్టిక్ సెంటర్లకు తప్పనిసరిగా పంపించాల్సి వస్తోంది. 104 టెంపరేచర్ కు వెళుతున్న ఈ జ్వరాలతో డేంజర్ ఎంత?
ఒళ్లు చాలా వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూస్తే.. 104 డిగ్రీలు కనిపిస్తుంది. అదీ జ్వరం వచ్చిన తొలి రోజే ఇలా ఉంటే.. అలాంటివారికి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. అందుకే ఫీవర్ వచ్చినవారికి వెన్నులో వణుకు పుడుతోంది. మామూలుగా అయితే జ్వరం లక్షణాలను బట్టి అది ఏ రకం ఫీవరో ఓ అంచనాకు వస్తారు. దానిని బట్టి ట్రీట్ మెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడొస్తున్న జ్వరాలు.. ఏ రకమైనవో.. వాటి లక్షణాలు ఏమిటో.. వాటికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో కూడా కొందరు వైద్యులకు అంతుబట్టని పరిస్థితి ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన కేసులు వెలుగుచూస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు విజృంభిస్తాయి. ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం, వీధుల్లో పారిశుధ్యం లోపించడం, వాతావరణంలో మార్పులు.. ఇలాంటి వాటివల్ల ఎక్కువ మంది జ్వరం బారిన పడతారు. కానీ ఈసారి ఇలా ఫీవర్ బారిన పడ్డవారిలో విచిత్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి రోగులను కలవరపెడుతున్నాయి. ఈ కేసులు వైద్యులకు సవాల్ గా మారుతున్నాయి.
జ్వరంతోపాటు కీళ్లనొప్పులు ఉంటే దానిని డెంగ్యూగా వైద్యులు గుర్తిస్తారు. కానీ ఇప్పుడొస్తున్న జ్వరం లక్షణాలను గమనిస్తే.. హైటెంపరేచర్ తో పాటు ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నాయి. అది డెంగ్యూ కేసే అని వైద్యులు భావించినా.. పరీక్షలు చేస్తే మాత్రం.. వైరల్ ఫీవర్ అని తేలుతోంది. కానీ దీని కోసం అన్ని రకాల టెస్టులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల జ్వరం లక్షణాలను గమనించి.. దాని ప్రకారం చికిత్స చేయడం కన్నా.. కచ్చితంగా పరీక్షలు చేసిన తరువాత.. దాని ప్రకారం ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి వస్తోంది. మామూలుగా అయితే జ్వరం, కీళ్లనొప్పులు కలిసి అటాక్ చేస్తే.. దానిని డెంగ్యూగా వైద్యులు భావిస్తారు. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే.. టైఫాయిడ్ లేదా మలేరియాగా అంచనాకు వస్తారు. అదే జ్వరంతోపాటు రోగికి శరీరంపై దద్దుర్లు వస్తే.. గన్యా ఫీవర్ గా గుర్తిస్తారు. ఈ లక్షణాలను బట్టి.. అది ఫలానా జ్వరం అని డాక్టర్లు చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడొస్తున్న జ్వరంలో.. అనేక లక్షణాలు బయటపడుతున్నాయి. పైగా ఈ లక్షణాల కాంబినేషన్లు మారుతున్నాయి. దీనివల్ల అది ఏ రకమైన జ్వరమో తేల్చలేక.. రోగులను డయాగ్నస్టిక్ సెంటర్లకు తప్పనిసరిగా పంపించాల్సి వస్తోంది.
ఈ జ్వరాలను.. లక్షణాలను బట్టి గుర్తించే వీలు లేకపోవడంతో కచ్చితంగా పరీక్షలు చేయాల్సి వస్తోంది. దీంతో డయాగ్నస్టిక్ సెంటర్లు… టెస్టుల కోసం వచ్చినవారితో కిటకిటలాడుతున్నాయి. నిజానికి ఇలాంటి జ్వరాలకు వైరస్ లే కారణం. ఆ విషయం తెలిసినా.. సరైన కారణం తెలియక టెస్టులు తప్పడం లేదు. అందుకే ఈ జ్వరాలకు మూలకారణాలను తెలుసుకుని.. దాని ప్రకారం చికిత్స చేస్తున్నారు. కాకపోతే.. ఇలాంటి జ్వరాల వల్ల టెంపరేచర్ పెరగడంతోపాటు.. బాడీలో అన్ని పార్ట్స్ పైనా ఎఫెక్ట్ పడుతోంది. దీంతో రోగి చాలా నీరసించిపోతున్నాడు. మామూలుగా వచ్చే జ్వరం.. మందులు వేసుకున్నా, లేకున్నా 3, 4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ జ్వరం మాత్రం వారం, పది రోజులైనా వదలడం లేదు. పైగా కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు రెండు వారాలు ఉంటున్నాయి. దీంతో ఇదేం మాయదారి జ్వరమో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తెలుగు గడపలో విజృంభిస్తున్న జ్వరంలో ముఖ్యంగా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అంటే జ్వరంతోపాటు నీరసం, వికారం, ముక్కు కారడం, నీళ్ల విరేచనాలు, గొంతు నొప్పి, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, కళ్లమంటలు, ఒళ్లంతా నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పైగా ఇది పండగల సీజన్. దీంతో చాలామంది ఆలయాలకు, షాపింగ్ మాల్స్ కు, హోటళ్లకు పోటెత్తుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో ఎక్కువమంది ఉండడంతో జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో స్వచ్ఛమైన గాలికి బదులు.. ఏసీలు ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు కూడా వీటి బారిన పడుతున్నారు. అంతకుముందు కొవిడ్ వచ్చినవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. వృద్ధులలో కూడా జ్వర బాధితుల సంఖ్య ఎక్కువే. అప్పటివరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారిపై.. ఈ జ్వరం అటాక్ చేసేసరికీ పూర్తిగా నీరస పడిపోతున్నారు. ఎందుకంటే.. ఈ జ్వరం వచ్చీ రావడంతోనే.. టెంపరేచర్ 104కు వెళుతోంది. దీని దెబ్బకు ఒంట్లో ఉన్న శక్తి అంతా ఆవిరైపోతోంది.
ఈ జ్వరం వచ్చిన తరువాత ప్లేట్ లెట్ల సంఖ్య కూడా చాలా స్పీడ్ గా పడిపోతోంది. దీంతోపాటు సీఆర్పీ పెరిగిపోతోంది. సీఆర్పీ అంటే.. సీ రియాక్టివ్ ప్రొటీన్. అంటే శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయిని ఇది సూచిస్తుంది. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే.. వెంటనే దీని కోసం చికిత్స తీసుకోవాలి. విశాఖపట్నం ప్రాంతంలో ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అందుకే అక్కడ పెద్దాసుపత్రులు, చిన్నాసుపత్రులు, క్లినిక్ లు రద్దీగా ఉంటున్నాయి. ఈ జ్వర బాధితుల ఎఫెక్ట్.. డయాగ్నోస్టిక్ సెంటర్ల వద్ద కనిపిస్తోంది. ఉదాహరణకు విశాఖపట్నంలోని కేజీహెచ్ ఓపీని పరిశీలిస్తే.. ఆగస్టు, 2024 వరకు జనరల్ మెడిసిన్ ఓపీ 2,632గా ఉంది. పైగా ఇందులో రెండుసార్లు వచ్చినవారు కూడా ఉన్నారు. అంటే ఏ స్థాయిలో జ్వరపీడితులు పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే.. విమ్స్ లో జనరల్ మెడిసిన్ ఓపీకి వచ్చేవారి సంఖ్య ఏకంగా పది శాతం ఎక్కువైందంటే.. సీన్ ఎలా ఉందో తెలుస్తోంది. ఎందుకైనా మంచిదని ఇక్కడికి వచ్చినవారిలో ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి కొవిడ్ పరీక్షలు చేశారు. మూడు కేసుల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఈ జ్వరాలను చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా.. ఫీవర్ వచ్చాక కొంతమందిలో 10, 15 రోజుల పాటు ఉండేసరికీ వాళ్లకు టెన్షన్ పెరుగుతోంది. అందుకే వైద్యులు కూడా.. కొవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటివి మళ్లీ పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, కాళ్లను క్లీన్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా చేయాలి. ఇంట్లో, ఇంటి బయట శానిటైజేషన్ తప్పనిసరిగా ఉండాలి. పైగా జ్వరం వచ్చినవారు వాడే వస్తువులను.. అంటే సోప్, టవల్ వంటివి వేరేవారు ఉపయోగించకూడదు. పౌష్టికాహారమే తీసుకోవాలి. కానీ తేలికగా జీర్ణం అయ్యే దానినే తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, చల్లగా ఉండే పదార్థాల జోలికి వెళ్లకూడదు. కొవిడ్ సమయంలో బాధితుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి కేర్ తీసుకుంటే.. చాలావరకు మంచిది.
ఇటు తెలంగాణలో చూసినట్లయితే.. మలేరియా, గన్యా, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ కేసుల సంఖ్య భారీగా పెరగడం, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూడడంతో ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. హాస్పటల్స్ లో రష్ పెరిగిపోతోంది. ఇది ఎంతలా ఉందంటే.. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఓపీ 10 నుంచి 30 శాతం వరకు పెరిగింది. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువమంది జ్వరం బారిన పడుతున్నారు. దీంతోపాటు దగ్గు, జలుబు వేధిస్తున్నాయి. కొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. అటు వర్షాలు, ఇటు ఎండల ప్రభావంతో పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలవుతున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో.. నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
ఎండాకాలం పోయి.. వానాకాలం మొదలైనప్పటి నుంచి జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే తెలంగాణలో జూన్ లో 1078 మందిలో డెంగ్యూ ఎఫెక్ట్ కనిపించింది. అదే జూలై నెల వచ్చేసరికీ ఈ నెంబర్ 1,461కి చేరింది. అదే ఆగస్టు నెలలో తొలి 20 రోజుల్లోనే 1,865కు పెరిగింది. అంటే కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలు, నగరాల్లో ఉండేవారికి వైద్యసేవలు ఎలాగోలా అందుతున్నా.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కుటుంబంలో ఒకరికి సోకినా.. మిగిలినవారిపైనా దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. చివరకు ఇన్ పేషెంట్ల నెంబర్ పెరగడం, పడకలు చాలకపోవడంతో.. వేరే దారిలేక.. చాలామందిని ఓపీలోనే చెక్ చేసి.. ఇంటికి పంపించేయాల్సి వస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా.. తెలంగాణలో ఇప్పటికే దాదాపు నాలుగున్నర వేల మంది డెంగ్యూ బారిన పడ్డారు. వీటిలో దాదాపు 1500 కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. కానీ కేసుల సంఖ్య.. ఈ లెక్కల కన్నా 10 రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే.. ఓపీ 20 శాతానికి పైగానే పెరిగింది. వైరల్ జ్వరాలు, మలేరియా, గన్యా, డెంగ్యూ కేసులు కూడా పెరిగినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. దోమలు వ్యాప్తి చెందకుండా అరికడితే.. కొంతవరకు జ్వరాల వ్యాప్తిని తగ్గించవచ్చు. అలాగే జ్వరం లక్షణాలు ఏం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స పొందాలి. పారిశుధ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది. కాచి వడపోసిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఈ జ్వరాల దూకుడు కళ్లెం వేయడానికి వీలవుతుంది.