ఈ డిజిటల్ యుగం అంతా స్మార్ట్ అయిపోయింది. గతం కంటే భిన్నంగా మన లైఫ్ స్టైల్ మారిపోతోంది. ఇదే కోవలోకి ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చేసింది. సినిమా చూసే విధానంలోనూ కొత్త ట్రెండ్ మొదలైంది. మల్టీప్లెక్స్ అంటే సినిమాలు ప్రదర్శించే చోటు. అక్కడే సినిమా చూసుకొని.. షాపింగ్ చేసుకొని.. భోజనం ముగించుకొని ఇంటికి రావొచ్చు. ఈ డిజిటల్ యుగంలో మనం కోరుకున్నది మన చెంతకే వచ్చే వీలున్నప్పుడు.. మరి మల్టీప్లెక్స్ కూడా మన ఇంటికే ఎందుకు రాకూడదు.. అనే ఆలోచనతో మొదలైన ట్రెండే మన ఇల్లే మల్టీప్లెక్స్.
బోర్ కొడితే బోలెడంతా ఎంటర్టైన్మెంట్.. ఆకలేస్తే ఆన్లైన్ ఫుడ్.. క్లిక్ దూరంలోనే షాపింగ్.. ఇంకేముంది ఇప్పుడు మన ఇల్లు స్మార్ట్ మల్టీప్లెక్స్‌గా అవతరిస్తోంది. ఇంటిలోని ఓ రూమ్‌ను మిని థియేటర్ చేయించుకుంటున్నారు ఔత్సాహికులు. దీంతో టైమ్, మనీ రెండూ సేవ్ అవుతుండటంతో చాలామంది హోమ్ థియేటర్లకు ప్రిఫేర్ చేస్తున్నారు. అంతేకాదు ఇంట్లో మిని థియేటర్ ఉంది అంటే ఆ స్టేటసే వేరు. ఇక ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఈ మిని థియేటర్లో కొత్త పాత సినిమాలు, లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ కంటెంట్, ఇతర ఆన్లైన్ కంటెంట్ ఎంచక్కా చూడొచ్చు. అంతేకాదు, త్రీడీ సినిమాలు కూడా చూసేయవచ్చు. త్రీడీ గ్లాసులు అన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆసక్తి మధ్యతరగతి కుటుంబాల్లోనూ పెరిగిపోతుంది. ఇక కొత్త ఇల్లు కట్టుకునే వారు చక్కటి థియేటర్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. 10-12 సీట్లతో థియేటర్లు ఏర్పటవుతున్నాయి. అపార్ట్మెంట్లు కొనుగోలు చేసుకునే వారు కూడా అందులో ఓ థియేటర్ ఏర్పాటుచేసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అంటే సినిమా థియేటర్ ఇంటికే వచ్చేసిందన్న మాట.
హోమ్ థియేటర్ ఎలా ఉంటుందంటే..
డిజిటల్ టెక్నాలజీ వచ్చాక చక్కటి అధునాతన థియేటర్లను ఇంట్లోనే ఏర్పాటుచేసుకోవడం సులభతరమైంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ప్రొజెక్టర్లతో థియేటర్లలో చూసిన అనుభూతిని ఈ హోమ్ థియేటర్లు అందిస్తున్నాయి. సినిమా థియేటర్ స్థాయిలో కాకపోయినా సాధారణ టీవీని మించిన పెద్ద స్క్రీన్ ఉండటమే హోమ్ థియేటర్ ప్రత్యేకత. ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్‌పై పిక్చర్ వేసుకుని చూడటమే కాక.. గోడనే స్క్రీన్‌గా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. సౌండ్ కోసం స్పీకర్స్, ఏవీ రిసీవర్స్/ ప్రాసెసర్స్ వాడాలి. అత్యుత్తమ శబ్దం కోసం అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక దీనికి హోమ్ ఆటోమేషన్ కూడా తోడైతే నాలుగైదు రిమోట్లకు బదులుగా స్మార్ట్‌ఫోన్ లేదా ఐప్యాడ్‌తో ఆపరేట్ చేసుకునేందుకు వీలవుతుంది. 55 అంగుళాలు, ఆపైన టీవీ ఉంటే సైతం హోమ్ థియేటర్‌గా మార్చుకోవచ్చు. హోమ్ థియేటర్ ట్రెండ్ నగరాలను దాటి చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది.
బడ్జెట్ ధరలోనే..
కనీసం 10X15 అడుగుల విస్తీర్ణం కలిగిన గదిని ప్రత్యేకంగా హోమ్‌థియేటర్ కోసం కేటాయించగలిగితే చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసంగా 2 లక్షల రూపాయలతో చక్కని హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసుకునే వీలుండటంతో చాలామందిని ఈ ట్రెండ్ ఆకర్షిస్తోంది. రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వెచ్చిస్తున్నవారున్నారు. మల్టీప్లెక్స్‌ల తరహాలో కావాలంటే కనీసం రూ.20 నుంచి 25 లక్షలు పెట్టాల్సిందే. బయటి శబ్దాలు లోపలికి – సినిమా శబ్ద హోరు గది బయటకు రాకుండా చేసే ఏర్పాట్లు మన్నికైన ఫ్లోరింగ్, కార్పెట్లు, ఏసీ, అత్యాధునిక ప్రొజెక్టర్, సౌండ్సిస్టమ్, మన్నికైన తెర, విశ్రాంతిగా కూర్చునేందుకు రిక్లైనర్ కుర్చీలు, సోఫాల వంటివి బడ్జెట్టుకు తగ్గట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెజాన్ ఫైర్‌స్టిక్, బ్లూరే ప్లేయర్, ఆపిల్ టీవీ వంటి వాటితో యాప్ ప్రసారాలనూ పెద్ద తెరలపై చూడొచ్చు.
ప్రొజెక్టర్..
బెన్క్యు, ఎప్సన్, సోనీ, పానసోనిక్, బార్కో వంటి కంపెనీలవి రూ.50,000-50 లక్షల వరకు లభిస్తున్నాయి. ఇక స్క్రీన్‌లో భిన్న రకాలున్నాయి. 80 నుంచి 400 అంగుళాలవి వాడుతున్నారు. స్పీకర్లు వంటివి ఏమీ కనపడని రకం ధర ఎక్కువ. సౌండ్ సిస్టమ్స్ కనపడేవి మరో రకం. రీవెర్బ్ వంటివి వాడుతున్నారు. రూ.2 లక్షల నుంచి 15 లక్షల మేర వీటి ధర ఉంటుంది. గోడపై ప్రత్యేక రంగు వేసీ, కూడా తెరలా వాడుకోవచ్చు. కెనడా నుంచి దిగుమతి అయ్యే స్క్రీన్గో బ్రాండ్ ఎక్కువగా వాడుతున్నారు. ఇందుకు రూ.10,000-12,000 అవుతుంది.
సౌండ్ ఎఫెక్ట్స్ కూడా థియేటర్ అనుభూతికి ఏమీ తక్కువ ఉండటం లేదు. పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప ఎలాంటి అనుభూతిని అయినా వీటి ద్వారా పొందవచ్చు. డాల్బి అట్మోస్, బోస్, మేయర్, బీ అండ్ డబ్ల్యు, మానిటర్ ఆడియో వంటి కంపెనీల స్పీకర్లు, ఆడియో సిస్టమ్ వూఫర్, యాంప్లిఫైయర్లతో కలిపి రూ.40,000 నుంచి రూ.2 కోట్ల వరకు ఉన్నాయి. తెరపై పాత్రలు మాట్లాడుతున్న వైపు నుంచే శబ్దం వచ్చేందుకు, స్పష్టతను బట్టి ధరలు మారుతుంటాయి. అయితే థియేటర్ స్థాయి అనుభూతి కావాలంటే, నాణ్యమైన హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రత్యేక గది కేటాయించాలి. విలాసవంత 4 బెడ్రూం ఫ్లాట్లు, విల్లాలు, డ్యూప్లెక్స్‌లు, సొంతగా నిర్మించుకునే సౌధాల్లో వీలుంటోంది.
ఇక తెరను బట్టి ఆడియో, వీడియో రిసీవర్ల అవసరం ఉంటుంది. ఇవి రూ.25,000-25 లక్షల వరకు లభిస్తున్నాయి. రీసౌండ్ రాకుండా ఏర్పాటు ఉంటుంది. ఐసొలేషన్ (గది నుంచి బయటకు శబ్దం రాకుండా), గదిలో శబ్దస్పష్టత బాగుండేలా, రీసౌండ్ రాకుండా (రీఇన్ఫోర్స్మెంట్) ఏర్పాట్లకు చదరపు అడుగుకు రూ.150 నుంచి 2500 వసూలు చేస్తున్నారు. గదిని బట్టి ఇది మారుతుంది. లైటింగ్ ఏర్పాట్లు కూడా ఆహ్లాదకరంగా, అనుగుణంగా చేస్తారు. ఇక రిక్లైనర్లు అమర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇవి రూ.25,000 నుంచి 6 లక్షల వరకు అవుతున్నాయి. 6 నుంచి 15 సీట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఒకే ఒక్క రిమోట్‌తో..
హోమ్ థియేటర్లో ప్రతి అవసరానికి ఒకే ఒక్క రిమోట్ ఉంటుంది. ప్రొజెక్టర్, చానల్, సౌండ్, ఓటీటీ, కేబుల్ నెట్వర్క్.. ఇలా ప్రతిదానికీ విడిగా రిమోట్లు కాకుండా ఒక్క ఐప్యాడ్‌తో చేసుకోవచ్చు. గదిలోకి రాగానే లైట్లు వెలగడం, ఏసీ ఆన్ చేసుకోవడం వంటి ఆటోమేషన్‌కు మరో లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
విడుదల రోజే చూడొచ్చు!
కొత్త సినిమా విడుదలయ్యే రోజే హోమ్ థియేటర్లోనే చూసే వీలు కూడా కలుగుతుంది. ఇందుకోసం డిజిటల్ ప్రింట్లలో సినిమాలు పంపిణీ చేసే సంస్థ డిస్ట్రిబ్యూటర్ల వద్ద లైసెన్స్ తీసుకుని, సర్వర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు ఒక్కసారి మాత్రమే సుమారు 4.5 లక్షలు చెల్లించాలి. ఇక కొత్త సినిమాను విడుదల రోజే చూసేందుకు హీరో, డిమాండ్‌ను బట్టి రోజుకు రూ. 2,000 నుంచి రూ. 40,000 వరకు నిర్మాతలు ఛార్జి చేస్తున్నారు. రోజులో ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. నిర్మాతలతో ఒప్పందం చేసుకునేందుకు క్యూబ్ పంపిణీదార్లే సహకరిస్తుంటారు. హోమ్ థియేటర్లు ఏర్పాటు చేసే సంస్థలే, డిజిటల్ ప్రింట్లలో సినిమాలు పంపిణీ చేసే క్యూబ్‌తో ఒప్పందాన్నీ చేసి పెడుతున్నాయి. దేశంలోని ప్రధానమైన 20-25 నగరాల్లో హోమ్‌థియేటర్ వ్యవస్థలు అమర్చిపెట్టే పెద్దస్థాయి సంస్థలు 10 వరకు ఉంటాయని అంచనా.
టన్నులకొద్ది కంటెంట్
హోమ్ థియేటర్‌కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హైఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆహా.. వంటి ఓటీటీ ద్వారా కోరుకున్న సినిమాలను చూసే వారి సంఖ్య అధికంగానే వుంది. థియేటర్లలో విడుదలైన సినిమా.. అక్కడ తీసేయగానే ఓటీటీల్లో వచ్చేస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటంతో తెలుగు, తమిళ, మలయాళమే కాదు బాలీవుడ్ సినిమాలూ చాలావరకు నేరుగా ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. థియేటర్లు తెరిచినా ఇప్పటికీ పలు పెద్ద, చిన్న సినిమాలు కూడా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని ఆవేదన చెందే నిర్మాతలు ఇప్పుడు నేరుగా ఓటీటీలకే విక్రయిస్తున్నారు. సత్తా ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కొనుగోలుకు ఓటీటీలు పదుల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలను దెబ్బతీసిన కరోనా ఓటీటీలకు మాత్రం వరంగా మారింది. వీటికి నాలుగైదేళ్లలో రావలసిన ఊపు కరోనా వల్ల ఏడాదిలోనే వచ్చింది. ఓటీటీ వేదికలు.. యాక్షన్, అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ, డ్రామా, సైన్స్‌ఫిక్షన్ ఇలా భిన్నమైన జానర్లలో, నాణ్యమైన, సృజనాత్మక కంటెంట్‌ను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఇలా ఓటీటీలో దొరికే కంటెంట్ అంతా మన మల్టీఫ్లెక్స్‌లో ఎంచక్కా చూసేయచ్చన్న మాట. అదీ మన బడ్జెట్ ధరలోనే. ఇక మన ఇల్లే మల్టీప్లెక్స్ ట్రెండ్ సినిమా రంగంపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రానున్న రెండు మూడేళ్లలో వినోద రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ కోసమే ప్రత్యేకంగా చిత్రాల నిర్మాణం ప్రారంభమైంది. ఇంటిలో సినిమా హాలు.. ఇంతలోనే ఎంత మార్పు? ఇదే రేపటి సినీమాయా బజార్ అన్నమాట.
ఇక ఇదే సమయంలో కొన్ని ఓటీటీలు రెస్టారెంట్లతో టై అప్ పెట్టుకుని డిస్కౌంట్ ధరలకే ఫుడ్ ఐటామ్స్ అందిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్‌లో డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో స్మార్ట్ మల్టీఫ్లెక్స్ సంస్థలు ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలు పెడుతున్నాయి. కరోనా కర్కశత్వం ఓటీటీకి వరంగా మారటంతో ఎప్పుడో రావాల్సిన మార్పు కాస్తంత ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు వినోద రంగంలో ఓటీటీదే హవా. ఓటీటీ తర్వాత ఇంకేమొస్తుందో ఇప్పుడే చెప్పలేంగానీ థియేటర్ మాత్రం ఇంట్లోనే ఉండే రోజులు వచ్చేశాయి. ఈ డిజిటల్ యుగంలో మల్టీప్లెక్స్ కూడా మన ఇంటికే వచ్చి మనకు వినోదం పంచుతోంది. బోర్ కొడితే బోలెడంతా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.
సినిమా స్టార్లతో మొదలై…
ఇంట్లోనే థియేటర్ ఉండాలన్న ఆలోచన సినిమా వారి నుంచే మొదట వచ్చింది. మొదట అగ్రహీరోలంతా తమ ఇళ్లల్లోనే మినీ థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సింహాద్రి చేసే రోజుల్లోనే ఓ మినీ థియేటర్ ను ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పుడు అగ్రహీరోలందరికీ సొంత థియేటర్లు ఉన్నాయి. హీరోలకే కాదు కొందరు దర్శకులకు కూడా ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా ఇలాంటి థియేటర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్, ప్రభాస్ లాంటి వారందరికీ ఇంట్లోనే హైరేంజ్ క్వాలిటీ థియేటర్లు ఉన్నాయి.
సినిమా సెలబ్రిటీలకే పరిమితమైన ఈ థియేటర్లు ఇప్పుడు సామాన్యుల ఇళ్లకు కూడా వచ్చేస్తున్నాయి. ఎంత చెట్టుకు అంతగాలిలా థియేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన పెద్ద సైజ్ ఎల్ఈడీ టీవీలు, 8 కే టీవీలు దాదాపు థియేటర్ అనుభూతిని అందిస్తున్నాయి. అయితే వీటిని ఇప్పుడు పేదలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఓమాదిరి మధ్య తరగతి వారు కూడా థియేటర్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీవీల తయారీ కన్నా థియేటర్ అనుభూతిని తామే అందించే ఏర్పాటు మీద టీవీ కంపెనీలు కూడా దృష్టిపెట్టాయి. టీవీల స్థానాన్ని ప్రొజెక్టర్లు భర్తీ చేస్తున్నాయి.
స్మార్ట్ మల్టీఫ్లెక్స్ ట్రెండ్ మొదలైంది. బడ్జెట్ ధరలో హోమ్ థియేటర్‌ను ఇన్స్టాల్ చేసి ఇస్తాము. కొత్త సినిమాలను కూడా నేరుగా మీ ఇంట్లోని థియేటర్లోనే చూసుకోవచ్చు. అంతేకాదు ఓటీటీ ద్వారా, కేబుల్ నెట్వర్క్ ద్వారా కూడా నిత్యం కంటెంట్ వీక్షించవచ్చు. మా నుంచి హోం థియేటర్ అందుకున్న వారికి సర్వీసు ఫుడ్ ఐటామ్స్, క్లాత్ ఐటామ్స్ కూడా డిస్కౌంట్ ధరలకే అందుకోవచ్చు.
శ్రీహర్ష, సీఈవో, స్మార్ట్ మల్టీఫ్లెక్స్ www.smartmultiplex.com
కరోనా పరిస్థితుల నేపథ్యంలో హోం థియేటర్‌కు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో సెలబ్రెటీలు మాత్రమే హోం థియేటర్‌కు మొగ్గు చూపేవాళ్లు. ఇప్పుడు చిన్నపట్టణాల్లో కూడా విలాసవంతమైన హోమ్ థియేటర్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యాంశాలు సినిమా తారలు, రాజకీయ నాయకులు, హెచ్ఎన్ఐలు, వ్యాపారవేత్తలు, చిన్న పట్టణాలకు చెందిన ధనవంతులు కూడా ఈ రోజుల్లో విలాసవంతమైన, పెద్ద హోమ్ థియేటర్లను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 2 వేలకుపైగా హోమ్ థియేటర్లను ఏర్పాటు చేశాం. ఇతర ప్రాంతాలలో మా నెట్‌వర్క్‌ను విస్తరించడానికి మేము ఫ్రాంచైజీ మోడల్‌ను ప్రారంభించబోతున్నాము. మొదటగా తెలంగాణలోని వరంగల్, కరీంనగర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమహేంద్రవరం వంటి నగరాల్లో ఫ్రాంచైజీ స్టోర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఎంవీ శేషారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, వెక్టర్ సిస్టమ్స్. www.vectorsystems.in
ఇటీవలే మా ఇంటిలో హోం థియేటర్ ఏర్పాటు చేసుకున్నాం. మా బడ్జెట్ ధరలోనే సాధ్యంకావడం సంతోషంగా ఉంది. ఇంతకాలం థియేటర్లో సినిమా చూసిన అనుభూతి.. ఇప్పుడు ఇంటిలోనే పొందుతున్నాం. ఇంతకాలం స్మార్ట్ ఫోన్లో చూసిన ఓటీటీ కంటెంట్ ఇప్పుడు బిగ్స్క్రీన్పై చూస్తున్నాం. మొత్తానికి కరోనా పరిస్థితుల తర్వాత ఎంతో సేఫ్‌గా ఇంటిలోనే స్మార్ట్ మల్టీప్లెక్స్ అనుభూతి పొందుతున్నాం.
యం. శశి, గృహిణి, హైదరాబాద్.
- ముద్దం నరసింహ స్వామి
9949839699
( ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం మేగజైన్ కవర్ పేజీకి రాసిన స్టోరీ..)