టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బందరు ఊసరవెల్లి వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని ఆయన అన్నారు. రాత్రికి రాత్రే వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసానని చెబుతుండటం అసత్యమని పేర్కొన్నారు.
వెబ్సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్ చేయడం వైసీపీకి పేటెంట్ హక్కుల్లాంటివని విమర్శించారు. తాము అలాంటి ఫేక్ రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రాజధాని అంశంలో ఆరోపణలు చేసినప్పుడు కూడా “ఏమీ పీకలేరు” అని చెప్పానని, ఇప్పటికీ అదే చెబుతున్నానని ధూళిపాళ్ల అన్నారు.
సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలనే ఉద్దేశంతో తనను 33 రోజులు జైలులో పెట్టారని ఆరోపించారు. అణువణువూ తనిఖీ చేసినా ఒక్క తప్పు కూడా బయటపడలేదని చెప్పారు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల కాలంలో కూడా తాను ఎప్పుడూ భయపడలేదని తెలిపారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రిక, సాక్షి టీవీకి రూ.307 కోట్ల ప్రకటనలు ఇచ్చారని ఆయన విమర్శించారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్ల ద్వారా మూడు లక్షల టన్నులకు పైగా సిమెంట్ కొనుగోలు జరిగిందని ఆరోపించారు. వైసీపీ పెట్టిన 22 కేసులు ఇప్పటికీ తనపై ఉన్నాయని, ప్రభుత్వం సహకరిస్తే ఆ తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందిస్తూ, నెయ్యిలో వెజిటబుల్ మరియు జంతు కొవ్వు ఉన్నట్లు NDDB నివేదికలో వెల్లడైందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో బటర్ ధర రూ.360 ఉండగా రూ.316కి నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు.
పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ ఇప్పుడు ఇతరులపై బురద జల్లుతోందని ఆయన విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి వద్ద తప్పు చేస్తే దానికి ఫలితం తప్పదని అన్నారు.
సంగం డెయిరీ గుంటూరు రైతులదని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని చెప్పారు. అమూల్ తరువాత దక్షిణ భారతదేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.
