తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా స్థిరాస్తి రంగంలో చోటు చేసుకున్న మార్పులు, పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బహిరంగ విలువలకి, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న విలువలకి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో, ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు భూముల రేట్లను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతో పాటు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు అమాంతం పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ల విలువలపై వేర్వేరుగా అధ్యయనం చేసి, ప్రాంతాల వారీగా 10 శాతం నుండి 30 శాతం వరకు పెంపు ఉండవచ్చని సమాచారం. హైవేల వెంట ఉన్న భూములకు ప్రత్యేక రేట్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి, మార్చి లేదా ఏప్రిల్ నెల నుండి కొత్త రేట్లను అమల్లోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. రిజిస్ట్రేషన్ విలువ పెరగడం వల్ల సామాన్యులపై భార పడనుండగా, ప్రభుత్వం మాత్రం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఆదాయం అవసరమని భావిస్తోంది. కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్న వార్తలతో, ఈ లోపే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని జనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సందడి పెరిగింది.
