తారా స్థాయికి చేరుకుంటున్న ప్రచారాలు…!
ఓట్లు రాబట్టుకోవడానికి మొదలైన ప్రలోభాలు…!!
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై కురుస్తున్న విమర్శల జడివానలు.!
అభ్యర్థి గెలుపే ధ్యేయంగా నాయకుల సుడిగాలి పర్యటనలు…!!
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ లలో ప్రచారపర్వం ఊపందుకుంటుంది. మరొక రెండు రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల తో పాటు పోటీల్లో ఉన్న అన్ని పార్టీల అధినాయకత్వాలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి లతోపాటు ఇతర పార్టీల నాయకుల అగ్ర నాయకత్వం మొత్తం కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమ తమ పార్టీల తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకోవడానికి కావలసిన శక్తియుక్తులు అన్నింటిని కూడగట్టుకుని పార్టీ అధినాయకత్వం ముందుకు పోతుంది. అన్ని జిల్లాల్లోనూ గల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీ సాధిస్తేనే మేయర్లు, చైర్మన్ స్థానాలను అధిక సంఖ్యలో దక్కించుకోవచ్చని, భవిష్యత్తు విజన్ తో విజయానికి కావాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకుంటూ, అభ్యర్థుల తరఫున పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతోపాటు ఇతర మంత్రులు కూడా తమకు కేటాయించిన ప్రాంతాలలో, తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కంకణ బద్ధులై ఎన్నికల రణ రంగాన తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు లతోపాటు, శాసనసభ్యులు లేని నియోజకవర్గం పార్టీ ఇంచార్జీ లతోపాటు డిసిసి అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర, జిల్లా అధికార ప్రతినిధులు, వీరికి తోడుగా ఎమ్మెల్సీలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష టిఆర్ఎస్ బిజెపి పార్టీల మాజీ మంత్రులతో పాటు, బీ ఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనసభ్యులు లేని ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రచార బాధ్యతను తీసుకొని అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకుపోతున్నారు. బిజెపి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇటీవలనే రాష్ట్రానికి వచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎంఐఎం, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీల నాయకుల ప్రచారంతో పాటు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన వారి తరఫున కూడా ప్రచారం ఊపందుకుంది.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లో తాము ముందున్నామని చెబుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తామే కనుక గ్రామపంచాయతీ ఎన్నికలలో మాదిరిగా మెజార్టీ స్థానాల్లో ఈ ఎన్నికల్లో కూడా తమను గెలిపిస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి వీలుంటుందని కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఓట్లను కాంగ్రెస్ పార్టీకే వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీ ఆర్ఎస్, బిజెపిలు కూడా తమదైన శైలిలో అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో కనీసం 50% కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తుతున్నారు. మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లేనని, హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శలు గుప్పిస్తూ తమకే ఓటు వేయాల్సిందిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా అందుబాటులో ఉండి న్యాయం చేసే ప్రభుత్వం తమదే అని కాంగ్రెస్ నాయకులు నమ్మకంగా ఓటర్లకు చెబుతూ ఓటర్లను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే లాగా సన్నద్ధులను చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా అధికార కాంగ్రెస్‌పై విమర్శలకు పదును పెడుతూ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఓటర్లకు వివరిస్తూ తమన గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. దీనికి తోడు అన్ని పార్టీల వారు కూడా జిల్లాలు నియోజకవర్గాలు, డివిజన్లు, వార్డుల వారీగా ఎన్నికల ఇన్చార్జులను, సమన్వయ కర్తలను (కోఆర్డినేటర్లు) నియమించారు. ఆయా పోటీ చేసిన ప్రాంతాలలో నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న తారతమ్యాలు, పొరపాట్లు, అభిప్రాయ భేదాలు ఉండడంతోపాటు సమన్వయం లోపిస్తే అందరికీ నచ్చ చెబుతూ పార్టీ విజయం లక్ష్యంగా కలసి మెలసి పనిచేయాలని హితబోధిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికల రణ రంగాన యుద్ధభేరి మోగిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా అన్ని రకాల అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుని ఎన్నికల కదన రంగాన కాలు దువ్వుతున్నారు. ఎన్నికల్లో చిన్నచిన్న తప్పిదాలు, పొరపాట్లకు తావివ్వకుండా ఆచితూచి విజయం సాధించడం కోసం ఎదురుచూస్తున్నారు. విజయం సాధిస్తేనే ఐదేళ్లపాటు అంబరాన్ని అంటేలా సంబరంగా జీవిత ఉంటుందని, లేని పక్షంలో ఐదేళ్లు ఒక శిక్షలాగా మదన పడాల్సి వస్తుందని ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీల అభ్యర్థులు విజయం కోసం మాత్రమే కడవరకు పోరాడాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఓటమి తమ దరిదాపుల్లోకి కూడా రాకుండా, ఓటమి పిలుపు కూడా తమకు వినపడకుండా ఉండాలని ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తలంపుతో ఉన్నారు. కేవలం విజయం కోసం మాత్రమే శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. విజయం సాధించడానికి గాను తమకు తోడుగా తమ తమ పార్టీల అగ్రనాయకత్వాలు, ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికల ప్రచారంలో తోడ్పాటునందిస్తూ పాల్గొనడంతో మరింత ఉత్సాహంగా అన్ని పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏ పార్టీ నాయకుల శ్రమ పలిస్తుందో, ఏ పార్టీని ఓటరన్న కరుణిస్తాడో వేచి చూడాల్సిందే.
