ఆణిముత్యాల్లాంటి పాటలు..
కట్టకట్టుకుని వచ్చిన కష్టాలు..
తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో ఆణిముత్యం నేలరాలింది. ప్రముఖ చలన చిత్ర గేయ రచయిత కందికొండ గిరి ఇకలేరు. రెండేళ్ల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న కందికొండ తాజాగా హైదరాబాద్లో కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నాగుర్లపల్లికి చెందిన కందికొండ 25 ఏళ్ల నుంచి దాదాపు 1,300 పాటలు రాశారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’.. ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’.. ‘గలగల పారుతున్న గోదారిలా’.. ‘చూపులతో గుచ్చిగుచ్చి చంపకే మేరే హాయ్’.. సినిమాల్లో ఇలాంటి ఎన్నో హిట్ సాంగ్స్.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి మరింత దగ్గర చేసే ప్రయత్నంలో… రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే అంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పాట, అలాగే ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా.. దాదీ మా బతుకమ్మా దామెర మొగ్గల బతుకమ్మా’ వంటి వందలాది పాటలను అందించారు. కందికొండ ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా పాపులర్ అయింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు. అంతేకాదు తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.
అయితే కందికొండ గత రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. సొంత ఇల్లు లేకపోవడం, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడంతో ఆ కుటుంబం ఎన్నో బాధలుపడింది. ఆసుపత్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి రావటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తండ్రికి వచ్చిన ఆరోగ్య సమస్యతో కూతురు చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ఎంతో భవిష్యత్ ఉన్న కందికొండను కాలం కసిదీరా కాటేసింది. కందికొండ లేని లోటు తెలుగు సిని సమాజానికి తీరని లోటు. ఆ అక్షర శిల్పికి నివాళి అర్పిస్తోంది తెలుగు సమాజం.