అమెరికాలో తెలుగు ఎన్నారైలు నిర్మించిన ‘అమెరికాలో మనం’. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఓ పాట హైదరాబాద్ రవీంద్రభారతీలో ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ సినిమా నుంచి ‘‘అలుపెరగని పరుగుల్లోన..’’ అనే పాటను ఆవిష్కరించారు. చిత్రయూనిట్‌ను, మూవీ మేకర్ వేణు నక్షత్రంను అభినందించి, ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అవంతిక నక్షత్రం, డైరెక్టర్ సాయిరాం పల్లె పాల్గొన్నారు.
అంతా తెలుగు ఎన్నారైలే నటించి నిర్మించిన ఫీల్ గుడ్ మూవీ ‘అమెరికాలో మనం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అమెరికాలోనే ఈ తెలుగు సినిమాను పూర్తిగా చిత్రీకరించడం మరో విశేషం. ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ కాబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. మూవీ మేకర్, రైటర్ వేణు నక్షత్రం సమర్పణలో, నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్ నుంచి, అవంతిక నక్షత్రం నిర్మాణంలో సాయిరాం పల్లె దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా. ఇందులో స్వాతిరెడ్డి, సాయిరాం పల్లె, అశ్విన్ నల్ల, చైతన్య సాయిరాం, హర్ష కిరణ్, శ్వేత శంకర్, దివ్య రావెల్ల, శ్రీ మీరజ్కర్, గరిమా తదితరులు నటించారు.
ఇటీవల విడుదలన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులోని ఐదు అద్భుతమైన పాటలను ప్రణీత్ మ్యూజిక్, కార్తీక్ కొడకండ్ల కంపోజ్ చేశారు. ప్రణీత్ మ్యూజిక్ చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా అందించారు. అమెరికాలో మనం.. అనే టైటిల్ సాంగ్‌ను ప్రణీత్ రాసి కంపోజ్ చేయగా శ్రీకృష్ణ విష్ణుబొట్ల ఆలపించారు. అలుపెరగని పరుగుల్లోనా.. పాటను రఘుకుల తిలక్ రాయగా, పావని వాస, తరుణ్ దోనిపాటి ఆలపించగా కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ అందించారు. ఎన్నారై గాయనీ గాయకులు తరుణ్ దోనిపాటి, కశ్యప్ వెంతురుపల్లి, అనన్య పెనుగొండ, కార్తీక్ జయంతి తమ అద్భుత గాత్రంతో ఆలపించారు.
అంతా ఎన్నారైలు కలిసి నటించిన ఈ సినిమాను వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీలాండ్ లోని బ్యూటీఫుల్ లొకేషన్లలో చిత్రీకరించినట్టు డైరెక్టర్ సాయిరాం పల్లె తెలిపారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యి అమెరికాలో హిట్టయిన “కాక్టైల్ డైరీస్” వెబ్ సిరీస్ ని ఇప్పుడు “అమెరికాలో మనం” పేరుతో కొన్ని మార్పులతో, కొత్త పాటలతో సినిమాగా తెలుగు రాష్ట్రాల్లో అందరిని అలరించదానికి సిద్ధం అయ్యింది. ఈ సినిమాలోని ఐదు పాటలు “మధుర ఆడియో” ద్వారా అందరినీ అలరిస్తున్నాయని నిర్మాత అవంతిక నక్షత్రం తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమా కోసం అటు ఎన్నారైలు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.