మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ‘ఆచార్య’ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ ఎలా ఉందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమాపై వివిధ మీడియాలో పబ్లిష్ అయిన రివ్యూలన్నీ దాదాపుగా నెగిటివ్‌గానే ఉన్నాయి. ప్రధానంగా రెండున్నరలోపే రేటింగ్‌లు వచ్చాయి. చిరు కెరీర్లోనే ఆచార్య పాత్ర అత్యంత నిస్సారమైన..నీరసం తెప్పించే పాత్ర అని పలు రివ్యూలు విశ్లేషించాయి. లుక్ పరంగా 66 ఏళ్ల వయసులో చిరు కనిపించిన తీరుకు ఫిదా అయిపోతాం కానీ.. ఆయన ఇంత డల్లుగా కనిపించిన పాత్ర కెరీర్ మొత్తంలో వెతికినా కనిపించకపోవచ్చు. ఫ్లాప్ సినిమాల్లో కూడా తన వరకు బాగా హైలైట్ అవుతాడు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు చిరు. కానీ ఈ సినిమాలో అది మిస్సయింది. డ్యాన్సుల వరకు తన గ్రేస్ చూపించినా.. చిరు నుంచి ఆశించే మిగతా విషయాలేవీ కనిపించవు ఇందులో. చిరు చేసిన ఆచార్య పాత్రతో పోలిస్తే సిద్ధ క్యారెక్టరే కొంచెం నయం అనిపిస్తుంది. అలాగని దాని వరకు చూసుకుంటే అది కూడా అంతగా హైలైట్ అవ్వలేదు. చరణ్ పెర్ఫామెన్స్ ఓకే. తండ్రితో కలిసి చేసిన సన్నివేశాల్లో చరణ్ మెరిశాడు.
ధర్మస్థలి కోసం అవసరానికి మించే ఖర్చు పెట్టారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక దర్శకుడు కొరటాల శివ తన మీద అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కొరటాలకు ఎప్పుడూ రచనే బలం. ఈసారి అదే అతి పెద్ద బలహీనతగా మారింది. కథ దగ్గరే ఆయన పెద్ద తప్పు చేసేశారు. దానికి కట్టుబడి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఎన్నో పరిమితులన్న రొటీన్ కథను ఎంచుకోవడంతో దాన్ని అనుసరించి ముందుకు వెళ్లిపోయినట్లున్నారు. రొటీన్ ట్రాక్ నుంచి బయటికి రాలేక సినిమాను నిస్సారంగా తయారు చేశాడు. అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ భారీ మెగా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆ అంచనాలను అందకోలేక పోయింది. కాకపోతే, మెయిన్ కథాంశం, చిరు – చరణ్ ల నటన, వీరు కలిసి సాగిన సన్నివేశాలు, మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ స్క్రీన్ ప్రేజన్సీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, రొటీన్ సీన్స్ తో స్లోగా సాగే ప్లే, అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్, ఇక బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్.. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.. అంటూ పలు రివ్యూలు చెప్పుకొచ్చాయి.