చిత్రం: ‘యాద్గిరి & సన్స్’
విడుదల తేది: మే 5, 2023
నటీనటులు: అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు.
సంగీతం: విజయ్ కురాకుల
డీఓపీ: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పీఆర్వో: బి. వీరబాబు
కో-డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
డెబ్యూ హీరో అనిరుధ్ – యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి & సన్స్’. ఈ చిత్రానికి విజయ్ కురాకుల మ్యూజిక్ అందించారు. రోహిత్ విలన్ గా నటించారు. సీనియర్ నటడు జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, మోతీలాల్, నాగరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ అంటూ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
టైటిల్ పాత్రధారి యాద్గిరి(జీవా)కి ఇద్దరు కొడుకులు. పెద్దొడు లక్ష్మణ్(మోతీలాల్) పనిపాట లేకుండా ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. యాద్గిరి చిన్న కొడుకు వెంకట్(అనిరుధ్) ఓ ప్రైవేటు కంపెనీలో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అతడు స్వాతి(యశస్విని)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. ఆమె బర్త్ డేకు ఒక గిఫ్టు కొనిద్దామని డబ్బును బీరువాలో దాచుకుంటాడు. అన అన్న లక్ష్మణ్ దొంగతం చేసి తాగుతూ ఉంటాడు. అంత పెద్ద మొత్తాన్ని దొంగలించడంతో వెంకట్ కోపంతో ఊగిపోయి తన సోదరుడు తాగుతున్న కల్లు దుకాణంకు వెళ్లి… మందలించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవలో లక్ష్మణ్ చనిపోతాడు. దాంతో వెంకట్ కటకటాలపాలు అవుతాడు. మరి జైలుకు వెళ్లిన వెంకట్… స్వాతి ప్రేమను ఎలా పొందాడు? అసలు తన అన్న చావుకు వెంకట్ తో గొడవనే కారణమా? అసలు కథ ఏంటీ? వంటి విషయాలపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
హీరో అనిరుధ్ కి ఇది డెబ్యూ మూవీనే అయినా బాగా నటించాడు. ముఖ్యంగా సెకెండాఫ్ లో వరుస మరణాల వెనుక వున్న సస్పెన్స్ ని ఛేదించే క్రమంలో అతడు చూపించే నటన ఆకట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ గా విజయ్ పాత్రలో నటించిన నాగరాజు కూడా బాగా చేశాడు. అలాగే అతని సోదరునిగా లక్ష్మణ్ పాత్రలో నటించిన మోతీలాల్ తాగుబోతు పాత్రలో సహజంగా నటించాడు. ఇతని పాత్ర చూస్తే.. అక్కడక్కడ కనిపించే మనుషులే గుర్తొస్తారు. హీరోయిన్ గా నటించిన యశస్విని పాత్ర కూడా పర్వాలేదు. హీరోతో ఒక డ్యూయేట్ పెట్టాల్సింది. ఇక విలన్ పాత్రలో జోసెఫ్ గా నటించిన రోహిత్ కాసేపే కనిపించినా పర్వాలేదు అనిపించాడు. లాయర్ పాత్రలో రాజీవ్ కనకాల నిండుదనం కనిపిస్తుంది. టైటిల్ పాత్రలో యాద్గిరిగా. జీవా నటన ఆకట్టుకుంటుంది. అతని భార్యగా నటించిన మధుమణి పాత్ర కూడా అంతే. మిగతా పాత్రల్లో నటించిన మురళీధర్ గౌడ్, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
నిజంగా జరిగిన సంఘటనలను తెరకెక్కించాలంటే కాస్త రిస్క్ ఎక్కువే. మెయిన్ సబ్జెక్టును బేస్ చేసుకుని, ప్రేక్షకులను మెప్పించే విధంగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అప్పుడే రియల్ ఇన్సిడెంట్ బెస్డ్ సినిమాలకు ప్రేక్షకాధరణ ఉంటుంది. నిజానికి ఇలాంటి సబ్జెక్టులకు పెద్దగా స్టార్ కాస్ట్ అవసరం లేకపోయినా ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు గ్రిఫ్పుగా కూర్చొబెట్టవచ్చు. డైరెక్టర్ బిక్షపతి రాజు పందిరి ఈ పనిని సమర్థవంతంగా చేశాడనే చెప్పాలి. నిజంగా జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైంని బేస్ చేసుకుని.. దానిని అన్నదమ్ముల మధ్య ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న తగువులు లాంటి రోజూ మనం ప్రతి ఇంట్లో చూసే సీన్లను స్క్రీన్ మీద చూపించి.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథలోకి వెళ్లాడు దర్శకుడు. సెకెండాఫ్ మొత్తం రియల్ స్టోరీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా? అనే సందేహం వస్తుంది. కానీ చివర్లో ఇలాగా జరిగిన న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను చూపెట్టడంతో ప్రేక్షకులకు సినిమాపై మరింతా ఇంట్రస్టు కలుగుతుంది.
తన రాసుకున్న కథకు ఎక్కడా హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగా సూటిగా తెరమీద చూపించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. తస్మాత్ జాగ్రత్త అనే మెసేజ్ కూడా ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఇక విజయ్ కురాకుల సంగీతం బాగుంది. శ్రీను బొడ్డు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాత చంద్రకళ పందిరి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి.
బాటమ్ లైన్: చివరి మాట: మెసెజ్‌తో అలర్ట్ చేసిన ‘యాద్గరి అండ్ సన్స్’
రేటింగ్: 3 / 5