తెలంగాణలో పర్యాటకం మ‌రింత‌గా విర‌జిల్లుతున్న‌ది. తెలంగాణ‌ రాష్ట్రంలోని పలు విహార కేంద్రాలు పర్యాటక యవనికపై తెలంగాణను కొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవ వేళ.. మది దోచే పది పర్యాటక కేంద్రాలను ప్రస్తావించుకుందాం.

లక్ష్మీనరసింహుడి శోభ‌
తెలంగాణ ఇంటి దైవం లక్ష్మీనరసింహుడు. ఆ స్వామి కొలువుదీరిన యాదగిరిగుట్ట రాష్ట్రంలోనే అత్యంత రద్దీ ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది. భవ్య మందిర నిర్మాణం తర్వాత, ఇల వైకుంఠంగా అలరారుతున్న గుట్టకు భక్తజనం పోటెత్తుతున్నారు. వారాంతం వచ్చిందంటే చాలు.. దేవదేవుడి కొండదారి పడుతున్నారు.

మన నయాగరా ఇదిగో..
తెలంగాణ వనసీమల్లో జలపాతాలు ఎన్నెన్నో. దేని ప్రత్యేకత దానిదే! వాటిలో ముచ్చటైనది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి దగ్గరున్న బొగత జలపాతం. 50 అడుగుల ఎత్తునుంచి పాల నురగలతో, నయాగరా సోయగాలతో దూకే బొగత జలదృశ్యం తెలంగాణ పర్యాటక సిగలో మంచు ముత్యాల పతకం.

ఛ‌లో లక్నవరం
ములుగు జిల్లాలో మరో మేటి పర్యాటక కేంద్రం లక్నవరం సరస్సు. సముద్రాన్ని తలపించే ఈ భారీ తటాకం ముచ్చటైన మూడు తీగల వంతెనలతో సందర్శకులను కట్టిపడేస్తుంది. వారాంతం వచ్చిందంటే చాలు పర్యాటక ప్రియులు చలో లక్నవరం అంటున్నారు.

రామప్ప ఎంతో గొప్ప‌..!
యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నం. మనసును గిలిగింతలు పెట్టే మదనిక రూపాలు, చూపు తిప్పుకోనివ్వని సాలభంజికలు, కాకతీయ వైభవాన్ని చాటే పేరిణి నృత్య శిల్పాలను చూస్తూ గంటలు గంటలు గడిపేయొచ్చు.

ప్రకృతి చెక్కిన శిల్పం
ప్రకృతి మలిచిన అపురూప శిల్పాలను చూడాలంటే పాండవుల గుట్టకు వెళ్లాల్సిందే! జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లె సమీపంలో ఉంటుంది ఈ పర్యాటక కేంద్రం. పొరలు పొరలుగా పేర్చిన శిలలు వింతాకృతుల్లో దర్శనమిచ్చి అబ్బురపరుస్తాయి.

నల్లమల దారిలో..
నల్లమల అటవీ సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే మన్ననూరు కన్నా మంచి ప్రదేశం ఉండదు. శ్రీశైలానికి వెళ్లే దారిలో ఉండే ఈ పర్యాటక కేంద్రం చిక్కటి అడవికి చక్కటి చిరునామా! ఫరహాబాద్‌ వ్యూ పాయింట్‌ నుంచి కృష్ణానది సోయగాలు అద్భుతంగా ఉంటాయి. మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం ఇక్కడికి దగ్గరే!

రాజ‌ధానిలో గ‌ర్వ‌కార‌ణాలు..
ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకున్న మన రాజధాని పర్యాటకులకు స్వర్గధామం. తళతళమెరిసే హుస్సేన్‌సాగర్‌ చెంత కొత్తగా వెలసిన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, అమ‌రవీరుల జ్యోతి.. ఇలా ఒకేచోట రాజ‌ధాని ఘ‌న‌త క‌నిపిస్తుంది.

కృష్ణాతటిపై..:
నల్లమల కొండల దర్పం, కృష్ణవేణి వయ్యారం ఒకేసారి చూడాలంటే పోయిరావలె సోమశిలకు! నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో ఉన్న సోమశిల వారాంతపు విహారానికి చక్కటి చిరునామా.

రాజన్న సన్నిధి
కోడె మొక్కుల రాజన్న తెలంగాణ ఇష్టదైవం. ఏ చింత కలిగినా రాజన్న చెంతకు వెళ్తే తీరిపోతుందని విశ్వాసం. రాజన్న దేవస్థానం యాదగిరిగుట్ట తరహాలో కొత్త వైభవాన్ని సంతరించుకునే రోజు ఎంతో దూరం లేదు.

రాజన్న సన్నిధి
కోడె మొక్కుల రాజన్న తెలంగాణ ఇష్టదైవం. ఏ చింత కలిగినా రాజన్న చెంతకు వెళ్తే తీరిపోతుందని విశ్వాసం. రాజన్న దేవస్థానం యాదగిరిగుట్ట తరహాలో కొత్త వైభవాన్ని సంతరించుకునే రోజు ఎంతో దూరం లేదు.

రాజ‌ధానిలో తీగ‌ల వార‌ధి
హైదరాబాద్ దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెన. ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది రికార్డులకి ఎక్కింది. ఇది అంద‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా కొన‌సాగుతోంది.

నీరా కేఫ్..
ప్ర‌కృతిలో దొరికే నీరా ఇప్పుడు రాజ‌ధానిలోనూ చోటు క‌ల్పించుకుంది. నీరాను హైదరాబాద్ వాసులకు పరిచయం చేసేలా ప్రభుత్వం హుస్సేన్‌ సాగర్ తీరాన అత్యంత ఆకర్షణీయంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. ప‌ర్యాట‌కుల‌కు పల్లె ప్ర‌కృతి త‌ర‌హాలో సేద తీరుస్తూ ఆరోగ్య‌క‌ర‌మైన నీరాను తాగిపిస్తోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. హైదరాబాద్‌ సిగలో రోజుకో పర్యాటక ఆకర్షణ వచ్చి చేరుతున్నది. ప‌ర్యాట‌కంలో ప్రెష్ ఫీలింగ్‌ను తెస్తోంది.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *