కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన, ప్రణాళిక పై దృష్టి పెట్టింది. మొదటి 100 రోజుల పాలన లో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో ఆమేరకు లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ టార్గెట్ పై దృష్టి సారించాయి అన్ని శాఖలు. సెప్టెంబర్ 22 వ తేదీకి 100 రోజుల పూర్తి కానున్నాయి. ఇక కేవలం 26 రోజుల గడువు మాత్రమే ఉండడంతో వడివడిగా 100 ప్రణాళికకు అడుగులు పడుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు గేర్ మారుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్య రీతిలో గ్రాండ్ విక్టరీ కొట్టిన కూటమి సర్కార్.. తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కసరత్తు చేస్తోంది. ఆ మేరకు మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ఫోకస్ పెట్టింది. పాలనలో సమూల మార్పులు తెచ్చేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా.. గత ప్రభుత్వ తప్పిదాలను 100 రోజుల్లోనే సరిదిద్దేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలతో అన్ని శాఖలు దాదాపు లక్ష్యాలను చేరుకునేలా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆ యాక్షన్ ప్లాన్‌కు గడువు 26 రోజులు మాత్రమే ఉండడంతో మరోసారి అన్ని శాఖలను అలెర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపైనా పలు సూచనలు చేశారు. దాంతో.. వంద రోజుల ప్రణాళికకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను వివిధ శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపాయి.
రెండు నెలలుగా నిరంతరం అన్ని శాఖలను సమీక్షించిన సీఎం చంద్రబాబు.. ఆయా రివ్యూల్లోనే 100 రోజుల ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వడంతో అధికార యంత్రాంగం స్పీడ్ పెంచింది. ప్రధానంగా.. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రాజధాని అమరావతిపై స్పెషల్ ఫోకస్.. వ్యవసాయశాఖపై దృష్టి, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్లలో ఇన్సెంటివ్స్ ప్రకటన లాంటి అంశాలపైనా దృష్టి సారించాయి ఆయా శాఖలు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయా శాఖల మంత్రులు కూడా అలెర్ట్ అయ్యారు. దానిలో భాగంగా.. హోంమంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అటు.. సీఆర్డీఏ యంత్రాంగమూ అప్రమత్తమైంది. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ ఐఐటీ బృందాలతో అధ్యయనం చేయించి ఓ డిటేయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయించింది. ప్రస్తుతం ప్రాథమిక నివేదిక అందగా.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ప్రభుత్వం. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అమరావతిని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చే పనులు కొనసాగుతున్నాయి.
ఇక.. మరికొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి సర్కార్ 100రోజుల యాక్షన్ ప్లాన్ గడువు సమీపిస్తుండడంతో ఆయా అంశాలకు సంబంధించిన పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని 13,326 గ్రామపంచాయతీల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేసి ఉపాధి పనుల తీర్మానాలు కంప్లీట్ చేశారు అధికారులు. కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రాసెస్ ప్రారంభమై తుది దశకు చేరుకుంది. మొత్తంగా.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం.