హ‌మరా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయంలో IG కి ఫిర్యాదు

హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వ్యక్తిత్వం, జీవితం, ఆలోచనా విధానం, రాజ్యాంగ నిర్మాణంపై సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు, నిర్ధారణ లేని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హ‌మరా ప్రసాద్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఐజీ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు అందజేశారు. అంబేద్కర్‌పై తప్పుడు, నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడంతో పాటు ‘కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని ప్రచురించి త్వరలో విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఐజీ దృష్టికి తీసుకెళ్లారు.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడం వల్ల సమాజంలో అపోహలు, విద్వేషాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రచారంలో ఉన్న అంశాల వాస్తవాలను పరిశీలించాలని వారు కోరారు. విచారణలో చట్టపరంగా నేరం నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ చంద్రశేఖర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తీగల అశోక్‌ కుమార్‌, బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర నాయకుడు దేవతి శ్రీనివాస్‌, బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పగిడిమర్రి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ గౌరవం, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం చట్టబద్ధమైన మార్గంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *