▪️ లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు
▪️ యూనియన్ నిధులపై పారదర్శకత కోరుతున్న మహిళా కార్మికులు
▪️ మ‌హిళా ప్రొడక్షన్ వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు
▪️ ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని డిమాండ్

హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలపై లెక్కలు అడిగిన సభ్యులను అవమానిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్‌లో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి తమ వాదనను వెల్లడించారు.

‘ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు’
ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు రేణుక, శైలజ, భారతమ్మ, ఆదిలక్ష్మి, అరుణ తదితరులు మాట్లాడుతూ అధ్యక్షురాలు లలితపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓట్లతో అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత లలిత తమ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. సమావేశాల్లో, ఇతర సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు మీడియా ముందే చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. యూనియన్‌లోని సభ్యులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్షురాలిపై ఉందని, అయితే తమను కించపరిచేలా మాట్లాడటం బాధాకరంగా ఉందని అన్నారు. కార‌ణం లేకుండా త‌న‌కు న‌చ్చ‌ని స‌భ్యుల‌ను అనవసరంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం ? యూనియన్‌లో కమిటీతో కూర్చొని మాట్లాడిన తర్వాత తప్పు అయితే వారికి శిక్ష విధించవచ్చు. ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం? అని ప్ర‌శ్నించారు.

పదేళ్ల ఆర్థిక లెక్కలు చూపించాలి
యూనియన్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా అడిగినప్పుడు దానికి స‌రైన స‌మాధానంగా మా ప్రెసిడెంట్ లెక్కలు చూపించాలి. కానీ అది చూపించకుండా.. ”అక్కడ బిందె ఉంది, ఇక్కడ గ్లాస్ ఉంది, అక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అదిగో ఒక కుర్చీ ఉందమ్మా..” ఇవే ఈ ప్రాపర్టీ అని ఎగతాళిగా మాట్లాడుతుంది.. అని స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యూనియన్‌లో ఆర్థిక వ్యవహారాలపై పూర్తి పారదర్శకత ఉండాలని సభ్యులు డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలు, ఆదాయ-వ్యయ వివరాలు సభ్యులకు వెల్లడించాలని కోరారు. యూనియన్ సభ్యులు చెల్లించే చందాలు, ఇతర రూపాల్లో వచ్చే నిధులు ఎలా ఖర్చవుతున్నాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు’
యూనియన్ నిబంధనల ప్రకారం అధ్యక్షురాలు, కార్యదర్శి, క్యాషియర్‌తో పాటు కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సభ్యులు తెలిపారు. అయితే అధ్యక్షురాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిటీ ఆమోదం లేకుండానే ప్రశ్నించిన సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీంతో తమ ఉపాధికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘పనులు ఇవ్వొద్దంటూ ఒత్తిడి’
తమను ప్రశ్నించినందుకు కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ చీఫ్‌లకు ఫోన్లు చేసి సంబంధిత సభ్యులకు పనులు ఇవ్వవద్దని ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికే రోజువారీ ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సంస్థలోని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బదులు, సభ్యులపై పోలీసు ఫిర్యాదులు, కేసుల పేరుతో ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

‘మా కష్టార్జితానికి లెక్క అడుగుతున్నాం’
తమ జీవన పరిస్థితులను కూడా మహిళా కార్మికులు వివరించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రొడక్షన్ పనుల్లో పనిచేస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. చిన్న పిల్లలను ఇళ్ల వద్ద వదిలి పనులకు వస్తున్నామని, ఏడాదికి ₹5,000 చొప్పున యూనియన్‌కు చందా చెల్లిస్తున్నామని చెప్పారు.

“మేము కష్టపడి సంపాదించిన డబ్బుకు లెక్క అడుగుతున్నాం. అందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం, పనులు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం?” అని వారు ప్రశ్నించారు. రోజువారీగా వచ్చే పరిమిత ఆదాయంతో పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్న తమపై చర్యలు తీసుకోవడం వల్ల కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
యూనియన్‌లో నెలకొన్న వివాదాన్ని వెంటనే పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు జోక్యం చేసుకోవాలని సభ్యులు కోరారు. యూనియన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, స్థలం కొనుగోలు తదితర అంశాలపై పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలకు చర్చల ద్వారా పరిష్కారం చూపించి, తమకు ఉపాధి పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *