90వ దశకంలో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన మారణహోమానికి దృశ్యరూపంగా తెరకెక్కించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. కేవలం 10 కోట్లతో వచ్చిన స్టోరీ ది కశ్మీర్ ఫైల్స్.. ఈజీగా 350 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి సంచలన రికార్డులు సృష్టించింది. సీన్ కట్ చేస్తే.. ది తెలంగాణ ఫైల్స్ పేరుతో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఓ భయంకరమైన చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నట్టు సమాచారం. రజాకార్ల అరాచక పాలనపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బానిస సంకెళ్లతో మగ్గిపోయారు. అప్పటి నిజాం హయాంలోని రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం భయంగా బతికారు. మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతేలేదు. అలాంటి భయంకరమైన చరిత్రను ది తెలంగాణ ఫైల్స్ సినిమాలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తున్నారు? ఎవరెవరు నటిస్తున్నారు? ఎన్ని భాషల్లో రాబోతోంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా తెలంగాణ ఫైల్స్ ఎటువంటి సంచలనాలకు తెర తీస్తుందో అనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.