మానవత్వం పరిమళిస్తోంది. సమాజ సేవ చేస్తూ.. అనాథ చిన్నారుల ఆకలి తీరుస్తూ.. తనవంతు బాధ్యత చూపిస్తున్నారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వహకులు కుమార్, శ్రీలత కుమార్. కోవిడ్ మహమ్మారి విజృంభించిన విపత్కార సమయంలో వీరు చేసిన సేవలు సమాజం ఎప్పటికీ మరిచిపోదు. నిరుపేదల ఆకలి తీర్చారు. ఎన్నో కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించారు. ఆకలితో ఎవరూ బాధపడకూదన్న లక్ష్యంతో నిరంతరం సేవలో నిమగ్నమయ్యారు.
మనం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవకు అనేక అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ప్రజాడైరీ మ్యాగజైన్ ఆధ్వర్యంలో తాజాగా అరుదైన సత్కరాన్ని అందుకున్నారు. వీరు చేస్తున్న సమాజ సేవకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అవార్డు అందించారు. ‘మనం’ ఫౌండేషన్ నిర్వహకులు కుమార్, శ్రీలత కుమార్లను సత్కరించారు. క్షణం తీరిక లేకుండా, మంచి పనులలో నిమగ్నమై ఉండేవారు, నిత్యం సంతోషంగా ఉంటారని నమ్మి, తాము సమాజానికి అవసరమైన సేవ చేస్తున్నామని అంటారు మనం ఫౌండేషన్ కుమార్. పదిమందికి ఉపయోగపడే పనులు చేసి పలువురి మనసులు గెలవటం తమ ఫౌండేషన్ అదృష్టం అన్నారు. ఈ సేవా పురస్కారాన్ని మనం ఫౌండేషన్ కి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న అమెరికా ప్రతినిధులు కాసర్ల శ్రీని, తపస్వి రెడ్డి, తాటిపల్లి ప్రవీణ్, జై, దుబాయ్ సుజాత రాంచందర్ రెడ్డి, ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి కుమార్ అంకితమిచ్చారు.