సమ్మర్ సోగ్గాళ్ళు మూడింతల వినోదం అందించబోతున్నారని ప్రచారం చేసిన ‘ఎఫ్ 3’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మొదటి ఆట చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు, రేటింగులు ఇచ్చేస్తున్నారు. ‘ఎఫ్ 2’ లో మెయిన్ క్యారెక్టరైజేషన్లతో కొత్త కథతో ”ఎఫ్ 3” చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ‌స్ట్ సినిమాలో భార్యాభర్తల కథకు ఫన్ అండ్ ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. ఈ సినిమాలో కథంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. నిజానికి అందుకునే విధంగా ఈ సినిమా సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ అనే మాదిరిగా ఉంటుంది. అంటే ఎఫ్ 2 లో వెంకటేష్-త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్-మెహ్రీన్ భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తే.. ఎఫ్-3లో పెళ్లి అవ్వ‌క ముందు ఎలా క‌లిశారో చూపించిన‌ట్టు ఉంది.

ఇక‌ వెంకటేష్ రేచీకటి బాధితుడిగా తన మార్క్ టైమింగ్ తో అదరగొట్టేశాడు. వరుణ్ తేజ్ నత్తితో మాట్లాడే యువకుడిగా నవ్వులు పూయించాడు. చెప్పుకోడానికి కథ ఏమీ పెద్దగా లేకపోయినా.. ఆధ్యంతం ఎంటర్టైన్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను నడిపించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఇద్దరూ తగినంత గ్లామర్ డోస్ అందించగా.. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో మెరిసింది. సునీల్ – అలీ కామెడీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. వెన్నెల కిషోర్ – రాజేంద్ర ప్రసాద్ – మురళీ శర్మ – రఘుబాబు – శ్రీకాంత్ అయ్యంగార్ – పృథ్వీరాజ్ – ప్రగతి – అన్నపూర్ణ – వై విజయ వంటి భారీ తారాగణాన్ని అనిల్ హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించినా.. పెద్దగా అలరించలేకపోయిందని అంటున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక మైనస్ అని పబ్లిక్ టాక్ ని బట్టి తెలుస్తోంది. సినిమాను తన మార్కు కామెడీతో నడిపించిన అనిల్ రావిపూడి.. కొన్నిచోట్ల కామెడీ సీన్లను బలవంతంగా పెట్టినట్లు ఉందని అంటున్నారు. పేరడీ కామెడీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ ని ఉపయోగించుకోవడం ఆయా అభిమానులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సమయంలో ఈవీవీ సినిమా కామెడీని గుర్తు చేస్తుందని అంటున్నారు. ‘ఎఫ్ 2’ కంటే ఇది ఎక్కువ నవ్వించిందని కొందరు అంటుంటే.. ‘f 2’ కి మూడింతలు ఫన్ మాత్రం కాదని మరికొందరు అంటున్నారు. ఓవరాల్ గా ‘ఎఫ్ 3’ కథ గురించి ఆలోచించకుండా, లాజిక్‌ల గురించి అస్స‌లు ప‌ట్టించుకోకుండా సినిమా చూస్తే నవ్వుకుంటూ థియేటర్లలో నుంచి బయటకు రావొచ్చని చూసిన‌ ఆడియ‌న్స్ చెబుతున్నారు. రివ్యూ ఇచ్చిన అధిక వెబ్‌సైట్లు ఈ సినిమాకు 2.75 స్టార్స్ రేటింగ్ ఇచ్చాయి.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *