బెజవాడ ఎంపీ కేశినేని నానికి అన్ని వైపుల వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. కోట్లాది రూపాయల అప్పులు బ్యాంక్ నుంచి తీసుకుని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసు దాక తెచ్చుకోవడం వెనుక కేశినేని వ్యవహార శైలియే కారణమే చర్చ వినిపిస్తోంది.
ఐదేళ్లు వెనక్కి వెళితే.. 2017లో తన ట్రావెల్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించి ఎంపీ కేశినేని పెద్ద చర్చకే తావిచ్చారు. బస్సులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి వందల కోట్లు తెచ్చుకున్నారంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి కేశినేని మరో విజయ్ మాల్యా లాగా తయారయ్యాడని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ట్రావెల్స్ సంస్థను మూసివేసిన కేశినేని ఆ తర్వాత కార్గో బిజినెస్ మొదలుపెట్టారు. దానికి కూడా బ్యాంక్ అప్పులు తీసుకోవడంతో తలకు మించి భారం అవ్వడంతో ఆర్థికంగా దివాల తీసినట్టు బెజవాడలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కేశినేని ట్రావెల్స్ నష్టాల ఊబిలో చిక్కుకపోగా.. ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరిపోయిందట. దానికి తోడు గతంలో బ్యాంక్ ల నుంచి చేసిన అప్పులు కాస్తా మెడకు చుట్టుకుంటున్నాయి.
ఇటు ఆర్థిక వ్యవహారాలతో సతమతమవుతుండగా, అటు రాజకీయంగానూ కేశినేని దిగజారిపోతున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. బెజవాడలో బలంగా ఉన్న టీడిపి క్యాడర్ కు సైతం కేశినేని నాని తీరు చిర్రెత్తికొస్తోందట. అంతేకాదు సొంత కమ్మ సామాజిక వర్గంతోపాటు బీసీ, మైనారిటీ వర్గాలకు.. కేశినేని దూరమైన పరిస్థితి. బెజవాడలో బుద్దా వెంకన్న, బోండా ఉమ, జలీల్ ఖాన్ ఇలా ఒకరేమిటి.. ఎవర్నిపడితే వారిని, సొంత పార్టీ నేతలపై కూడా నోరు పారేసుకుంటూ అన్ని వర్గాల వారికి చిరాకు తెప్పిస్తున్నారు.
ఇక తన ఫ్యామిలీ వాళ్లతోనూ, బంధువులతోనూ ఇదే వ్యవహారం. ఇటీవల కేశినేని నాని కార్యాలయం ముందు ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపించారు. కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని నాని.. తన సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
సొంత బాబాయ్ ఎపిసోడ్ ఇలా ఉంటే.. సొంత సోదరుడు కేశినేని శివనాథ్ ఆలియస్ చిన్నితో కూడా విభేధాలు ఉన్నాయట. సొంత పార్టీలో ఆక్టివ్గా ఉన్న తన సోదరుడు ఎక్కడ తనను మించిపోతాడోననే భయంతో ఎంపీగారు ఉన్నట్టు తెలుస్తోంది. కేశినేని చిన్ని ఇటీవల ‘మహానాడు’లోనూ చురుగ్గా వ్యవహరించారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న కేశినేని చిన్నికి అధిష్టానం నుంచి కూడా మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ఇన్చార్జ్లు, పార్టీ నేతలు ఎంపీ నానికి దూరంగా ఉన్నరని టాక్. వారంతా కేశినేని చిన్నికి టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. నాని వ్యవహారం నచ్చకే చిన్నిని పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రోత్సహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఓ వైపు ఫ్యామిలీ వాళ్లతో విభేధాలు కొనసాగుతుండగా, అటు పార్టీ నాయకులతోనూ ఇదే రకంగా శత్రుత్వం కనిపిస్తోంది. విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మురో ముఖ్య నేత నాగుల్ మీరాతో కేశినేని నానికి తీవ్ర విభేదాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా పార్టీ అధినేత చంద్రబాబుతోనూ విభేధాలు ఉన్నట్టు తాజాగా కేశినేని కామెంట్లను బట్టి తెలుస్తోంది. తాను టీడీపీ ఎంపీని మాత్రమే కానని అసలు ఏ పార్టీకి చెందని ఎంపీనని ప్రకటించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తన శతృవును చంద్రబాబు ప్రోత్సహిస్తే చంద్రబాబు శతృవును తాను ప్రోత్సహిస్తానని చెప్పినట్లు ఎంపీ మీడియాతో చెప్పటమే విచిత్రంగా ఉంది.