చూపు లేకున్నా యూట్యూబ్‌లో సంచలనాలు
ఆడబిడ్డ. పుట్టుకతో చూపు లేదు. ‘ఎందుకు ఈ పిల్ల?’ అన్నారు కొందరు. కన్నపేగు ఊరుకుంటుందా? బిడ్డను అక్కున చేర్చుకుంది తల్లి. పేద కుటుంబమే అయినా ప్రేమకు కొదువ లేకుండా పెంచింది. అంతలోనే, ఆ తల్లి చనిపోయింది. బిడ్డ పరిస్థితి ఏంటి? కట్‌చేస్తే.. ఇప్పుడామె సక్సెస్ఫుల్ యూట్యూబర్. నాగలక్ష్మికి పుట్టుకతోనే దృష్టిలోపం. ఐదో తరగతి వరకే చదువుకున్నది. అయితేనేం, అపారమైన ఆత్మవిశ్వాసం. కష్టపడి వంట నేర్చుకున్నది. అమ్మ మరణం తర్వాత.. అన్న, నాన్న.. ఇద్దరికీ తనే వండిపెట్టేది. అప్పటికి అన్న ఆదిరెడ్డికి ఉద్యోగం లేదు. చెల్లెను నాన్నకు అప్పగించి, ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. అదే ఆమె జీవితంలో గొప్ప మలుపు. తెలుగునాట బొడ్డు నాగలక్ష్మి, బోండల కవిత జంట యూట్యూబర్స్ గురించి తెలియనివారు ఉండరు. జనాల్లోకి అంతగా వెళ్లిందీ వదినామరదళ్ల ముచ్చట. ‘హాయ్ అండీ.. నేను మీ నాగలక్ష్మి.. వెల్కమ్ టు కవిత నాగ వ్లాగ్స్’ అంటూ మొదలయ్యే సరదా సంభాషణ వీక్షకులను కట్టిపడేస్తుంది. ఆ వీడియోలను పెద్దగా ఎడిటింగ్ చేయరు. స్క్రిప్ట్ అసలే ఉండదు. చాలా సింఫుల్‌గా, ఆత్మీయులతో ముచ్చట పెడుతున్నట్టు అనిపిస్తుంది. ‘న్యూ రెంట్హౌస్’ వీడియోనే తీసుకోండి. దీంట్లో నాగలక్ష్మి, కవితతో పాటు కవిత కూతురు చిన్నారి అద్విత ఉంటుంది. అద్దె ఇంటి కష్టాలు.. సొంతింటి లాభాలు చెబుతూనే.. ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఎలాగో వివరిస్తారు. నెల రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు లక్షల వ్యూస్ వచ్చాయి.
నాగలక్ష్మి, కవిత వీడియోల్లో వంట, ఔటింగ్, ప్రొడక్ట్ మేకింగ్ వంటివీ ఉంటాయి. పులిపిర్ల చికిత్స తరహా చిట్కాలకూ వీక్షకులు బాగానే స్పందించారు. తనకు చూపులేదనే న్యూనతాభావం నాగలక్ష్మిలో అస్సలు కనిపించదు. ఆడబిడ్డకు అన్ని వేళలా తోడుగా ఉంటుంది ఆదిరెడ్డి భార్య కవిత. ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ఆదిరెడ్డి మొదట్లో ‘బిగ్‌బాస్’ షోపై రివ్యూ వీడియోస్ చేసేవాడు. మంచి రెస్పాన్స్ వచ్చేది. దీంతో ఇదే వ్యాపకంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో తిరిగి సొంతూరికి వచ్చేశాడు. అదే సమయంలో కవితతో పెండ్లయ్యింది. వదిన-మరదలు బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోయారు. సక్సెస్ఫుల్ యూట్యూబర్స్‌గా అవతరించారు. ఆ సంపాదనలో కొంతభాగాన్ని సామాజిక సేవకు కేటాయిస్తూ సోనూసూద్ మనసునూ గెలిచారు. వీరి వంట వీడియోలు చూస్తే అమ్మచేతి రుచి గుర్తుకొచ్చి తీరుతుంది. ఈ ఇద్దరూ రెండు నెలల క్రితం చపాతీ లడ్డూ వీడియో చేశారు. ఆ ఐడియా నాగలక్ష్మిదే. దీనికి లక్షల వ్యూస్ వచ్చాయి.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు వీళ్ల సొంతూరు. ప్రస్తుతం కావలిలో ఉంటున్నారు. తల్లి మరణం తర్వాత ఐదేండ్ల పాటు నాగలక్ష్మి చాలా కష్టాలు అనుభవించింది. చేతిలో పైసాలేని పరిస్థితి. తండ్రికి రెండుసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆదిరెడ్డి పెళ్లితో కవిత ఇంట్లో అడుగుపెట్టింది. అదృష్టమూ కలిసొచ్చింది. వదిన-మరదళ్ల బంధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారు కవిత-నాగలక్ష్మి. ఈ ఇద్దరి అనుబంధం గురించి ఎవరో కామెంట్ చేశారట. అలాంటివారికి ‘సర్ప్రైజ్ టు నాగలక్ష్మి’ వీడియోతో సమాధానం ఇచ్చారు. ‘దయచేసి అలా మాట్లాడొద్దు. మేం ఇద్దరం చాలా ప్రేమగా ఉంటాం’ అనేది వీడియో సారాంశం. 2 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చి నాగలక్ష్మిని సర్ప్రైజ్ చేయడమే హైలైట్. రెండు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. దటీజ్ ఆదిరెడ్డి యూట్యూబర్ ఫ్యామిలీ.