తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో వినాయకుడిని తొలుత పూజించి పనులు మొదలు పెడతారు. ఇక పెళ్లి జరిగే ఇంట్లోని తొలి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ కొరియర్ అందుకునే అవకాశం కల్పిస్తోంది.
వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ శ్రీవారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షింతలు వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. అక్షింతలు పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు. ఇందుకోసం ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి-517501’ అనే చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయవచ్చు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానుక సంగతి పక్కన పెడితే, వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రధమైన కార్యం.
To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building
K.T.Road
Tirupati
517501.