భారతీయ రియల్ మార్కెట్ లో ఎన్నారైలు అత్యంత ముఖ్యమైన కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు. ప్రస్తుతం చాలామంది ప్రవాస భారతీయులు విదేశాల నుంచి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. భారతీయ రియల్ రంగం లాభదాయకంగా ఉన్న సంగతి వారికి తెలిసిన నేపథ్యంలో స్వదేశంలో ఎలాంటి ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతారు? వారి ప్రాధాన్యతలేమిటో చూద్దామా?

అప్పట్లో చాలామంది డెవలపర్లు ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ‘ఎన్నారై ప్రాజెక్టులు’ లాంచ్ చేసి విక్రయించేవారు. ఎన్నారైలు మాత్రమే ఇల్లు కొనే ప్రాజెక్టు ఒకటి అయితే.. తమ పొరుగువారు కూడా అంతే హై ప్రొఫైల్డ్ వ్యక్తులే ఉంటారనే భావన కలిగించేలా డెవలపర్లు వాటిని మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయించేవారు. అప్పట్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడంతో ఇక్కడ ఏమి జరుగుతుందో ఎన్నారైలకి తెలిసేది కాదు. ఫలితంగా ఎక్కువ ధర పెట్టి ఎన్నారై ప్రాజెక్టులో ఇల్లు కొనుక్కునేవారు. అయితే, ప్రస్తుతం ఎన్నారై ప్రాజెక్టుల విధానం విఫలమైంది.

ప్రస్తుతం ఎన్నారైలు చాలామంది యువత కావడం.. వారికి టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండటంతో భారత రియల్ మార్కెట్లో ఏం జరుగుతోందో అక్కడి నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నారు. డెవలపర్ల జిమ్మిక్కులను పసిగట్టగలుగుతున్నారు. 2023లో గృహాల కొనుగోలులో పెద్ద పాత్ర పోషించబోయే ఎన్నారైలు ఎలాంటి ఇళ్ల కోసం చూస్తున్నారో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది.

ఇదీ ఎన్నారైల ఆకాంక్షల చిట్టా..
ఎన్నారైలు స్వదేశంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మూలధన విలువ లేదా అద్దె ఆదాయం కోసం ప్రాపర్టీ కొనడం ఒకటైతే.. స్వదేశానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత వినియోగం కోసం రెండోది. ప్రస్తుతం ఎన్నారైలు పెద్ద, మంచి ప్రాజెక్టుల్లోనే ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. 2023లో కూడా ఇదే కొనసాగుతుంద‌ని చెప్పొచ్చు.

ప్రవాస భారతీయులు తక్కువ ధరల ఇళ్ల కోసం వెతకడంలేదు. విశాలమైన, సురక్షితమైన, అత్యంత సౌకర్యవంతమైన, అత్యంత అనుకూలమైన ఇళ్ల కోసమే చూస్తున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చే చాలామంది ఎన్నారైలు తమ కంపెనీలతో రిమోట్ వర్కింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇంట్లోనే ఆఫీసు ఉండటం అవసరం. అలాగే భారత్ లో కూడా రిమోట్, హైబ్రిడ్ పని విధానానికి కంపెనీలు అంగీకరించినందున అద్దెదారులు కూడా ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ కావాలని ఆశిస్తున్న విషయం ఇక్కడ పెట్టుబడి పెట్టే ఎన్నారైలకూ తెలుసు. అందువల్ల వారు పెద్ద పెద్ద ఇళ్లకే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ హోం ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వాకింగ్ లేదా జాగింగ్ కోసం వెళ్లే అవకాశం, విశాలమైన, రద్దీ లేని పరిసరాల్లో క్రీడలు, పచ్చని బహిరంగ ప్రదేశాలు, ఫుట్ పాత్ లతో కూడిన చక్కని రోడ్లు ఎన్నారైల ఆకాంక్షల జాబితాలో ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత రోజువారీ ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో తమ పిల్లల భద్రత కూడా ముఖ్యమని ఎన్నారైలు భావిస్తున్నారు. వారి వయసు, చదువుతో సంబంధం లేకుండా వారి విద్యా సంస్థకు, ఇంటికి మధ్య సాధ్యమైనంత తక్కువ దూరం ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రోజువారీ అవసరాలకు సంబంధించిన సౌకర్యాలు కూడా దగ్గర్లోనే ఉండాలని భావిస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్ కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *