ప్రభాస్‌ `ఈశ్వర్‌` సినిమాతో వెండితెరకు పరిచయం నటుడు, ఈటీవీలో `మాయాబజార్` సీరియల్ 150 ఎపిసోడ్స్ చేశారు. పలు యాడ్స్ చేశారు. ఆయ‌నే డా. హను కోట్ల. హను కోట్ల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నటించిన చిత్రం `ది డీల్‌`. ఈ మూవీతో ఆయన వెండితెరకు దర్శకుడి పరిచయ‌మయ్యారు. సిటాడెల్‌ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్‌ అనిత రావు సమర్పణలో హెచ్‌ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఇందులో చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ తాజాగా (అక్టోబర్‌ 18) న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్ వ‌ల్ల కోమాలోకి వెళ్తాడు. హ‌స్పిట‌ల్‌లో ఆ కోమా నుంచి బయటకు వచ్చి గతం మర్చిపోతాడు. త‌న భార్య‌ లక్ష్మి(ధరణి ప్రియా)ని తలుచుకుంటాడు. ఆమె ఎక్క‌డుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ విలన్‌ ఇందు(సాయి చందన)ని చంపేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీని వెనకాల మాదవ్‌(రవి ప్రకాష్‌) ఉంటాడు. ఇందు ఎవరూ లేని ఒంటరి అమ్మాయి. ఇందుని కాపాడి ఆమెకి దగ్గరవుతాడు భైరవ. ఇందుని ఆసుపత్రిలో కలవడానికి మాదవ్‌, లక్ష్మి వస్తారు. అక్కడ లక్ష్మిని చూసి ఆమెని కలిసేందుకు భైరవ వెళ్లగా, త‌న భ‌ర్త ఈ భైర‌వ కాద‌ని, మ‌రో భైర‌వ అని వేరే వ్య‌క్తిని చూపిస్తుంది. మరోసారి తను నా భార్య అంటూ ఆసుపత్రిలో గొడవ చేస్తారు. తమ ప్లాన్స్ కి అడ్డుగా వస్తున్న భైరవని కూడా చంపేయాలనుకుంటారు మాధవ్‌, లక్ష్మి. మరి భైరవ భార్య అయిన లక్ష్మి మాదవ్‌ని భైరవగా ఎందుకు చెబుతుంది? ఆయనతో ఎందుకు తిరుగుతుంది? ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మధ్యలో ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె).. ఇందుకి ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు? ఈ మొత్తం కథకి? ఇందుకి ఉన్న సంబంధమేంటి? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల‌ ప్ర‌తిభ‌:
సినిమాలో కీల‌కమైన‌ భైరవ పాత్రలో హను కోట్ల బాగా చేశాడు. అన‌వ‌స‌ర‌పు హీరోయిజానికి పోకుండా సాధార‌ణంగా కనిపిస్తూ కథని మలుపు తిప్పుతున్న‌ తీరు నచ్చుతుంది. వేర్వేరు వేరియేషన్స్ చూపించిన తీరు బాగుంది. ఇక‌ ఇందు పాత్రలో నటించిన సాయి చందన త‌న‌ న‌ట‌న‌కు మంచి మార్కులు వేయించుకుంది. తను ఒంటరి అనేది, అమ్మ సెంటిమెంట్‌ సీన్లలో గుండెని బరువెక్కించింది. ఇక రావు పాత్రలో రఘు కుంచె హుందాగా చేశాడు. తనదైన నటనతో మెప్పించాడు. రవి ప్రకాష్‌ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. లక్ష్మి పాత్రలో ధరణి ప్రియా సైతం అదరగొట్టింది. ఆమె పాత్రలో ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. రావు కుమారుడుగా మహేష్‌ పవన్‌ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ హైలైట్‌. కాసేపుకనిపించినా ఆకట్టుకున్నాడు. ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన‌ ర‌ఘు కుంచె, మ‌హేష్ య‌డ్ల‌ప‌ల్లి, గిరి, వెంక‌ట్ గోవ‌డ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
ఆర్‌ఆర్‌ ధృవన్ అందించిన సంగీతం బాగుంది. సంద‌ర్భానికి త‌గిన‌ట్టు ప‌లు సీన్ల‌లో బీజీఎం ఆక‌ట్టుకుంటుంది. శ్రవణ్‌ కటికనేని ఎడిటింగ్ ప‌ర‌వాలేదు. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ బాగుంది, ఫ్రేమింగ్ బాగా సెట్ట‌యింది. ఇంకా క్వాలిటీగా చేయోచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతలో ప‌ర‌వాలేద‌నిపించాయి.

విశ్లేషణ:
ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ. దర్శకుడు సాధార‌ణ కథను ట్విస్ట్ లతో రాసుకుని తెర‌కెక్కించిన‌ తీరు బాగుంది. ట్విస్ట్ లు సినిమాకి హైలైట్. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌ సుఫారీ తీసుకుని ఆమె హత్యకు చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్‌, అనంతరం ట్విస్ట్ లు ఆకట్టుకునే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్‌ పార్ట్ ని పోషిస్తుంది. ఓ వైపు హీరోగా నటిస్తూ సినిమాని రూపొందించడం పెద్ద టాస్క్. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఈ మూవీ ద్వారా మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

ఫస్టాఫ్‌ అంతా హీరో యాక్సిడెంట్‌ తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మి మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతున్నాయి. ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.

సెకండాఫ్‌ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుంటుంది. ఇందుని చంపాలనుకుంటున్నది ఎవరు? ఇంతకి అసలు ఇందు ఎవరు? అనే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌ పాయింట్స్. అయితే సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్ ల పరంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు. అమ్మ సెంటిమెంట్‌ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. మొత్తానికి అన్ని కేట‌గిరి వాళ్లూ చూడాల్సిన సినిమా అనిపిస్తుంది.

రేటింగ్: 3.25 / 5

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *