▪️ అమాయా అగర్వాల్‌కు ప్రపంచ నంబర్-2 ర్యాంక్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్
▪️ అనయ్ అగర్వాల్ బోస్నియా ర్యాపిడ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన సూపర్ ట్విన్స్ అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చదరంగ రంగంలో సృష్టించారు. కేవలం 10 ఏళ్ల వయస్సులో అమాయా అగర్వాల్, రెండేళ్లలోనే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో ప్రపంచ నంబర్-2 ర్యాంక్ కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.
ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్ చైతన్య మాట్లాడుతూ.. “అమాయా అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఫిడే రేటింగ్‌లో 2004 పాయింట్లు సాధించిందని తెలిపారు. ఏకాగ్రా చెస్ అకాడమీలో కేవలం రెండేళ్ల శిక్షణతో ఈ స్థాయి విజయం సాధించడం తమ అకాడమీకి ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు.
అదే విధంగా, అనయ్ అగర్వాల్ బుడాపెస్ట్, బోస్నియాలో జరిగిన అంతర్జాతీయ చదరంగ టోర్నమెంట్లలో 100కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంక్‌ను మెరుగుపరచుకున్నాడని డాక్టర్ చైతన్య వెల్లడించారు. సూపర్ ట్విన్స్‌గా గుర్తింపు పొందిన అమాయా, అనయ్‌లు ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఏకాగ్రా చెస్ అకాడమీకి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చారని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ ట్విన్స్ తల్లి పనాషా అగర్వాల్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని ఇండస్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న తమ ఇద్దరు పిల్లలు అమాయా, అనయ్‌లకు అత్యుత్తమ శిక్షణ అందించి, ఈ ఘనత సాధించేలా ప్రోత్సహించిన ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్ చైతన్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయాలతో హైదరాబాద్ చదరంగ రంగంలో మరోసారి తన సత్తా చాటుకుందని, ఈ సూపర్ ట్విన్స్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధిస్తారని చదరంగ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.