హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిటల్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ళ్ల భారతిముఖి అనే యువతి చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన లగ్జరీ స్పోర్ట్స్ కారును జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడిపినట్టు పోలీసులు నిర్దారించారు. ఈ మేరక నిందితుడిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై నిందితుడు సంజుష్ వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను ఘటనా స్థలం నుంచి పారిపోలేదని చెప్పారు. తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని కాపాడేందుకు తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సాయం అందించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులకు వెల్లడించానని దర్యాప్తును పూర్తిగా సహకరిస్తున్నానని పేర్కొన్నారు.
మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపారా అనే కోణంలో పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షల ఫలితాలన్నీ నెగెటివ్‌గా వచ్చాయని సంజుష్ వెల్లడించారు. భారతి ముఖి మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అలాగే వైద్యపరీక్షల నివేదికను నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఆయన కోరారు. చట్టవ్యవస్థ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని, దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నానని సంజుష్ తెలిపారు.
