కాలం మారుతున్న‌ట్టే ట్రెండూ మారుతోంది. ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలోనూ పాత‌కు పాత‌రేసేలా కొత్త ట్రెండు పుట్టుకొచ్చింది. ఓటీ ( OTT ) టీలో సినిమా ఎవడు చూస్తాడెహే.. థియేటర్‌లో చూస్తేనే ఆ కిక్కు ఉంటుందని రెండేళ్ళ క్రితం వరకూ అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో.. అప్పుడే థియేటర్లకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడడంతో జనాలు ఓటీటీల వైపు మళ్ళారు. దీంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకి గిరాకీ పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నెగ్గుకు రావడం కష్టం అనే పరిస్థితి నుండి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు లేకపోతే జనాలు ఉండలేరు అన్న పరిస్థితిని కల్పించే స్థాయికి వచ్చాయి.

ఈ ఏడాది అత్యధికంగా 3 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఓటీటీ మార్కెట్‌.. ఇండియాలో రెండవ స్థానంలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2027 నాటికి 7 బిలియన్ డాలర్లకు ఈ మార్కెట్‌ లాభాల బాట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వున్న పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఏయే స్థానాల్లో వున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు సబ్‌స్క్రైబర్లు ఏ స్థాయిలో కలిగి వున్నాయి అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5, హైఫ్లిక్స్.. వంటి ఓటీటీలు చాలానే ఉన్నాయి. వీటిలో డిస్నీ+హాట్‌స్టార్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా 45 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఓటీటీ యూజర్లలో.. డిస్నీ+హాట్‌స్టార్‌కి అత్యధికంగా 14 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు కలిగి ఉంది. దీంతో డిస్నీ+హాట్‌స్టార్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 6 కోట్ల మంది వినియోగదారులతో అమెజాన్ ప్రైమ్ రెండవ స్థానంలో నిలవగా, 4 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో నెట్‌ఫ్లిక్స్‌ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. 3 కోట్ల 70 ల‌క్ష‌ల మంది కస్టమర్లతో జీ5 నాలుగు, రెండున్న‌ర‌ కోట్ల మందితో సోనీలివ్ ఐదో స్థానంలో నిలిచాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ.. డిస్నీ+హాట్‌స్టార్ ఒక కోటి 70 ల‌క్ష‌ల‌ మంది వినియోగదారులతో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. అమెజాన్ 99 లక్షల మందితో రెండవ స్థానంలో, 48 లక్షలతో జీ5, 42 లక్షలతో ఆహా, 40 లక్షల మంది వినియోగదారులతో నెట్‌ఫ్లిక్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక డిస్నీ+హాట్‌స్టార్‌ ఇండియాలో అగ్ర స్థానంలో నిలవడానికి కారణం ఐపీఎల్ మ్యాచ్‌లే. ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులని డిస్నీ+హాట్‌స్టార్‌ సొంతం చేసుకోవడం వల్ల ఇండియాలో నంబర్ వన్‌ పొజిషన్‌లో నిలిచింది. ఇక రీసెంట్‌గా హైఫ్లిక్స్ డాట్ కాం సంస్థ కూడా ఓటీటీ మార్కెట్‌లోకి ఎంట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఓటీటీ ఫైట్ మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని చెప్పొచ్చు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *